బంగారం వ్యాపారికి తుపాకీతో బెదిరింపు: ఆర్మీ జవాన్ అరెస్ట్

By narsimha lodeFirst Published Mar 21, 2021, 5:00 PM IST
Highlights

 బంగారం వ్యాపారిని తుపాకీతో బెదిరించిన  ఆర్మీ జవాన్ ను అరెస్ట్ చేసినట్టుగా విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి చెప్పారు.
 

విజయనగరం: బంగారం వ్యాపారిని తుపాకీతో బెదిరించిన  ఆర్మీ జవాన్ ను అరెస్ట్ చేసినట్టుగా విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి చెప్పారు.

పార్వతీపురం మండలం చినబంటువలస గ్రామానికి చెందిన సీహెచ్ రాజేశ్వరరావు ఉత్తర్ ప్రదేశ్ లో ఆర్మీ జవానుగా పనిచేస్తున్నాడు. ఇటీవల సెలవుపై స్వంత ఊరికి ఆయన వచ్చాడు. భూమి విషయంలో  రాజేశ్వరరావు సుమారు రూ. 22 లక్షలు నష్టపోయాడు. దీంతో ఈ డబ్బును సంపాదించాలని ఆయన ప్లాన్ చేశాడు.

ఈ మేరకు యూపీ రాష్ట్రంలో రూ. 30 వేలతో ఓ నాటు తుపాకీని కొనుగోలు చేశాడు. గత నెల ఏడో తేదీన పార్వతీపురం మండలానికి చెందిన బంగారం వ్యాపారి చినగుంపస్వామి అలియాస్ బాబు ఇంటి వద్దకు రాజేశ్వరరావు వెళ్లి తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆ తర్వాత అక్కడి నుండి వెళ్లి పోయాడు. అదే రోజు రాత్రి బంగారం వ్యాపారికి ఫోన్ చేసి తాను మావోయిస్టుగా పరిచయం చేసుకొని రూ. 5 కోట్లు డిమాండ్ చేశాడు. ఈ డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు.

అయితే రూ. 5 కోట్లకు బదులుగా కోటిన్నర ఇచ్చేందుకు వ్యాపారితో ఒప్పందం చేసుకొన్నాడు.ఈ విషయాన్ని వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసులకు వ్యాపారికి ఓ ప్లాన్ చెప్పారు.ఈ ప్లాన్ ప్రకారంగా నిందితుడు చెప్పిన చోటుకు డబ్బులు తీసుకెళ్లాలని సూచించారు.

నిందితుడు బంగారం వ్యాపారి నుండి డబ్బులు తీసుకొంటున్న సమయంలో రాజేశ్వరరావు ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

click me!