
ధర్మవరం : ఆంధ్ర ప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ఆర్మీ జవాన్ మీద వైసిపి నాయకుడు, అతని అనుచరులు కర్రలతో దాడి చేశారు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ధర్మారం మండలం తుమ్మల గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ మీద వైసిపి నాయకుడు, జెడ్పి వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి అతని అనుచరులు దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన వివరాలను బాధితులు ఈ మేరకు తెలిపారు.. సమరసింహారెడ్డి ఆర్మీ జవాన్. అతను కాశ్మీర్లో పనిచేస్తున్నాడు. తుమ్మల గ్రామంలో జరిగే పోతలయ్య జాతరలో పాల్గొనడానికి ఊరికి వచ్చాడు.
సమరసింహారెడ్డి తండ్రి నరసింహారెడ్డి టిడిపి నాయకుడు. ఈ కార్యక్రమానికి టిడిపి ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ ను నరసింహారెడ్డి ఆహ్వానించారు. ఈ క్రమంలో సుధాకర్ రెడ్డి బండి దారికి అడ్డుగా ఉంది. దీంతో సమరసింహారెడ్డి.. ఆ వాహనాన్ని కాస్త అడ్డతీయమని డ్రైవర్ కు తెలిపాడు. దీంతో డ్రైవర్ కోపానికి వచ్చి ఇది సుధాకర్ రెడ్డి వాహనం దీన్నే పక్కన తీయమంటావా అంటూ సమరసింహారెడ్డి తో వాదనకు దిగాడు. దీంతో సమరసింహారెడ్డి మా ఇంటి దగ్గర నుంచి పక్కకు తీసి ఎక్కడైనా పెట్టుకో.. అని చెప్పి వెళ్లిపోయాడు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ.. కేటీఆర్ వ్యాఖ్యలు, జగన్ ముందే ప్రతిపాదించారన్న సజ్జల
కాసేపటికి వారింటికి పరిటాల శ్రీరామ్ వచ్చి వెళ్లారు. అయితే, ఈ విషయాన్ని డ్రైవర్ అనంతపురం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కామిరెడ్డి పల్లి సుధాకర్ రెడ్డికి చేరవేశాడు. ఆ తర్వాత కార్యక్రమం పూర్తయ్యాక సప్లయర్స్ సామాన్లను సమరసింహారెడ్డి ట్రాక్టర్లో వేసుకుని ధర్మవరం బయలుదేరాడు. ఆ సమయంలో తుమ్మల గ్రామ సమీపంలో.. సుధాకర్ రెడ్డి, అతని డ్రైవర్, అనుచరులు ట్రాక్టర్ కు వాహనానికి అడ్డుపెట్టారు. సమరసింహారెడ్డిపై కర్రలతో దాడి చేశారు. ఆ సమయంలో సమరసింహారెడ్డితో ఉన్న యువకుడు ఒకరు సెల్ ఫోన్ లో దీన్ని వీడియో తీయడానికి ప్రయత్నించాడు. అతనిపైనా దాడి చేశారు.
ఈ దాడిలో ఆర్మీ జవాన్ అయిన సమరసింహారెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. పరిటాల శ్రీరామ్ ను జాతరకు తమ ఇంటికి ఆహ్వానించినందుకే ఈ దాడి చేశారని అతను తెలిపాడు. వైసీపీ నేతలతో తన కుటుంబ సభ్యులకు కూడా ప్రాణహాని ఉందని తెలిపాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో మాజీ ఎమ్మెల్యే గోసుగుంట్ల సూర్యనారాయణ, పరిటాల శ్రీరామ్ సమరసింహారెడ్డిని ఫోన్లో పరామర్శించారు.ఈ దాడి ఘటన మీద ధర్మవరం గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు.