మావోల హిట్ లిస్ట్ లో ఎమ్మెల్యే కిడారి

By Nagaraju TFirst Published Sep 23, 2018, 4:12 PM IST
Highlights

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును రెండు నెలల క్రితమే హిట్ లిస్ట్ లో చేర్చినట్లు తెలుస్తోంది. బాక్సైట్ తవ్వకాల నేపథ్యంలో ఎమ్మెల్యేను హిట్ లిస్ట్ లో చేర్చినట్లు సమాచారం. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలపై మావోయిస్టులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును రెండు నెలల క్రితమే హిట్ లిస్ట్ లో చేర్చినట్లు తెలుస్తోంది. బాక్సైట్ తవ్వకాల నేపథ్యంలో ఎమ్మెల్యేను హిట్ లిస్ట్ లో చేర్చినట్లు సమాచారం. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలపై మావోయిస్టులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాక్సైట్ తవ్వకాలను నిరసిస్తూ గతంలో ప్రజాప్రతినిధులను సైతం కిడ్నాప్ చేశారు మావోయిస్టులు. ఆతర్వాత బాక్సైట్ తవ్వకాలు నిలిపివేయడంతో శాంతించిన మావోయిస్టులు ప్రజాప్రతినిధులను విడుదల చేశారు. 

ఆ తర్వాత ఏజెన్సీలో మావోయిస్టుల ఏరివేతపై దృష్టిసారించిన పోలీసులు 2016అక్టోబరు 23న భారీ ఎన్ కౌంటర్ నిర్వహించింది. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత ఆర్కే తనయుడుతో సహా 24 మంది మృత్యువాత పడ్డారు. భారీ సంఖ్యలో సహచరులను కోల్పోవడంతో మావోయిస్టులు స్దబ్ధుగా ఉన్నారు. అప్పుడప్పుడు తన ఉనికిని కాపాడుకునేందుకు ఇన్ ఫార్మ ర్ లను హతమారుస్తున్నారు.


అయితే ఏవోబీలో రెండు నెలలుగా మావోయిస్టుల కార్యకలాపాలు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. గత నెలలో అమరవీరుల వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు హిట్ లిస్టులు తయారు చేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అమరవీరుల వారోత్సవాల సందర్భంగా వాల్ పోస్టర్లు సైతం ఏజెన్సీలో వెలిశాయి. అయితే మావోయిస్టుల హిట్ లిస్టులో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు పేరు ఉన్నట్లు తెలుస్తోంది. బాక్సైట్ తవ్వకాల నేపథ్యంలోనే కిడారిని హత్య చేసినట్లు తెలుస్తోంది. 

ఇకపోతే రెండు నెలలుగా మావోయిస్టులు ఏవోబీలో అలజడి సృష్టిస్తున్నారు. ప్రజాప్రతినిధులే టార్గెట్‌గా మావోలు రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. గిరిజన ప్రాంతాల్లో తరచూ సమావేశమైన మావోయిస్టులు ఆంధ్రా ఒడిశా బోర్డర్‌ స్పెషల్ జోనల్‌లో రిక్రూట్‌మెంట్ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది.  
 
ఈ నేపథ్యంలో ఉదయం మావోయిస్టులు ఒక్కసారిగా దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తన అనుచరులతో కలిసి వెళ్తున్నవాహనాన్ని డుంబ్రీగూడ మండలం లిప్పిటిపుట్ట దగ్గర మావోయిస్టులు అడ్డగించారు. ఆ తర్వాత ఆయనను కిందికి దించి అతి సమీపం దగ్గర నుంచి కాల్పులు జరిపారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన ప్రధాన అనుచరుడు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై కూడా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎమ్మెల్యే సర్వేశ్వరరావుతోపాటు సివేరి సోమ అక్కడికక్కడే మృతిచెందారు.  

click me!