ప్రభుత్వంలో విలీనంతో నష్టపోయాం... న్యాయం చేయండి: సీఎం జగన్ కు ఆర్టీసి ఉద్యోగుల లేఖ

By Arun Kumar PFirst Published Jan 17, 2022, 5:16 PM IST
Highlights

తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ఆర్టీసిని విలీనం చేయడంలో ఓ పీఆర్సీని నష్టపోయినట్లు ఆ సంస్థ ఎంప్లాయిస్ యూనియన్ ఏపీ సీఎం జగన్ కు లేఖ రాసారు. కాబట్టి తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేయాలని ఈయూ డిమాండ్ చేసింది.  

అమరావతి: తమ సమస్యల పరిష్కరించాలంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ఉద్యోగుల సంఘం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jaganmohan reddy)ని కోరారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో తాము తీవ్రంగా నష్టపోయామని... ఆ నష్టాన్ని భర్తీ చేసి తమకు న్యాయం చేయాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ (TRC EU) సీఎంను కోరింది. 

''2017 పీఆర్సీ (PRC)కి 2019లో 25శాతం తాత్కాలిక ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. కానీ ఏపిఎస్ ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయడంతో 2021లో ఒక పీఆర్సీ కోల్పోయాం. ఇలా విలీనం వల్ల కోల్పోయిన పీఆర్సీ నష్టాన్ని భర్తీచేయాలి'' అని ఆర్టీసి ఉద్యోగుల తరపున డిమాండ్ చేసారు. 

''ప్రభుత్వోద్యోగులతో పాటే మాకూ ఫిట్‌మెంట్‌ ఇస్తామన్నారు. 2021 పీఆర్సీ పెండింగ్‌లో పడగా తాజా పీఆర్సీ ప్రకటనతో అది నష్టపోతున్నాం. కాబట్టి మాకు అదనపు ఫిట్‌మెంట్‌ బెనిఫిట్ ఇచ్చి స్కేల్స్ నిర్ణయించాలి'' అని ఆర్టిసి ఈయూ సీఎంను కోరింది.  

''ఇక ప్రభుత్వంలో విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగుల సౌకర్యాలు తొలగిస్తున్నారు. ఇప్పటికే ఎస్‌ఆర్‌బీఎస్‌, ఎస్‌బీటీ, గ్రాట్యుటీ సౌకర్యం తొలగించారు. వైద్య సౌకర్యాలు, నెలసరి ఇన్సెంటివ్‌లు నిలిపేశారు'' అని తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళుతూ ఉద్యోగ సంఘం నాయకులు సీఎం జగన్ కు తెలిపారు. 

ఇదిలావుంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పీఆర్సీని ఇటీవలే ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో వుంచుకుని ఖజానాపై భారం మోపకుండా... ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా వుండేలా 23.25 శాతం ఫిట్‌మెంట్ ను ఇచ్చింది.  

రాష్ట్ర ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపకుండా ఆలోచించాలని సీఎం జగన్ ఉద్యోగ సంఘాలను కోరారు. ఉద్యోగులకు మంచి చేయాలనే తపనతో ఉన్నానని సీఎం తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలు 45 నుండి 55 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని కోరినా చివరకు 23.29 శాతం ఫిట్‌మెంట్ కి ఉద్యోగ సంఘాలు అంగీకరించాయి. 

పెండింగ్ డిఎలను కూడా ఒకేసారి ఇచ్చేందుకు సీఎం ప్రకటన చేయడంతో 23.29 శాతం ఫిట్‌మెంట్ కి ఉద్యోగ సంఘాలు అంగీకారం తెలిపాయి. అయితే ఉద్యోగ సంఘాలు కోరుతున్నట్టుగా కాకుండా ఆర్ధిక శాఖ అధికారులు ప్రతిపాదించినట్టుగా కాకుండా మధ్య మార్గంగా ఫిట్‌మెంట్ ను జగన్ ప్రతిపాదించారు. 

ఉద్యోగ సంఘాల సమావేశంలో  23.29 శాతం ఫిట్‌మెంట్ ను జగన్ ప్రతిపాదించారు. నెల రోజులుగా పెండింగ్ లో ఉన్న పీఆర్సీని అంశం ఇటీవలే కొలికి వచ్చింది.  ఉద్యోగ సంఘాలు తొలుత డిమాండ్ చేసినట్టుగా కాకుండా కొంత పీఆర్సీ ఫిట్‌మెంట్ తగ్గినా ఉద్యోగ సంఘాలు అంగీకరించాయి. 

అయితే ఉద్యోగ సంఘాలతో ఎలాంటి సమస్య లేకపోయినా తాజాగా ఆర్టీసి ఉద్యోగులతో ప్రభుత్వానికి చిక్కులు వచ్చేలా కనిపిస్తోంది. ఆ సంస్థ ఉద్యోగుల తరపున నాయకులు సీఎం జగన్ కు లేఖరాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.  

click me!