పీఆర్సీ సాధన సమితికి ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల మద్దతు

By narsimha lode  |  First Published Jan 28, 2022, 4:29 PM IST

పీఆర్సీ సాధన సమితికి ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కూడా సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఉద్యమంలో తాము కూడా పాల్గొంటామని ప్రకటించారు. ప్రభుత్వంలో విలీనమైతే ఉన్న సౌకర్యాలు కోల్పోతున్నామన్నారు.



అమరావతి: PRC సాధన సమితికి APSRTC ఉద్యోగ సంఘాల మద్దతును ప్రకటించాయి.ఉద్యమంలో ఆర్టీసీ Employees కీలకపాత్ర వహిస్తారని  హమీ ఇచ్చారు. అన్ని రకాల ఆందోళనకు పూర్తిగా మద్దతిస్తున్నామని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే లాభం జరుగుతుందనుకొన్నామన్నారు. కానీ ఇప్పుడేమో ప్రభుత్వంలో విలీనం చేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. 

తమకు ఉన్న సౌకర్యాలు కోల్పోతుంటే విలీనం ఇదేనా అనిపిస్తోందని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.రివర్స్‌ పీఆర్సీ వల్ల జీతాలు తగ్గే పరిస్థితి ఎదురైందని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.కొత్త పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ జీవోలతో తమ జీతాలు తగ్గే పరిస్థతి ఉందని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

Latest Videos

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల నేతలు ఈ నెల 7వ తేదీన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 23.29 శాతం పీఆర్సీ ఫిట్‌మెంట్ ఇస్తామని సీఎం   YS Jagan హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ లోని ఐదు D.A లను ఒకే సారి ఇస్తామని హమీ ఇచ్చారు. ఫిట్‌మెంట్ కనీసం 27 శాతానికి తగ్గకుండా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే పెండింగ్ డిఏలు ఒకేసారి ఇస్తామని హమీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి.

ఈ భేటీ తర్వాత Hraవిషయమై Chief Secretary నేతృత్వంలోని కమిటీతో ఉద్యోగ సంఘాలు సంక్రాంతి పర్వదినం కంటే ముందే పలు దఫాలు భేటీ అయ్యారు. కానీ ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్ పై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు.  అయితే ఈ నెల 17వ తేదీ రాత్రి పీఆర్సీపై  ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఈ జీవోల్లో హెచ్ఆర్‌ఏను భారీగా తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.

30 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ స్థానంలో 16 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వడంతో తాము 14 శాతం నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్ పై ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందించలేదు. దీంతో సమ్మెకు వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకొన్నాయి.  ఈ నెల 24న రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె  నోటీసును అందించాయి. అంతేకాదు ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం ఇప్పటికే నాలుగు దఫాలు ఉద్యోగులను చర్చలకు పిలిచింది. అయితే ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను నెరవేరిస్తేనే చర్చలకు హాజరౌతామని చెప్పారు.

ఫిబ్రవరి 7వ తేదీ వరకు పలు రకాల ఆందోళనలను ఉద్యోగ సంఘాలు నిర్వహించనున్నాయి. తమ ఆందోళనల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నారు. అప్పటికి కూడా ప్రభుత్వం నుండి స్పందన రాకపోతే సమ్మెలోకి వెళ్లనున్నారు. ప్రభుత్వం మాత్రం చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలను కోరుతుంది. చర్చలకు రావడానికి ఉద్యోగ సంఘాలు మాత్రం ప్రభుత్వానికి షరతులు విధించాయి.


 


 

click me!