
ఒంగోలు: కనిగిరి ఏపీఎస్పీడీసీఎల్ ఈఈ బాస్కర్ రావుపై సస్పెన్షన్ వేటు పడింది. దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ సోదరుడు శ్రీధర్ ఈఈ భాస్కర్ రావుతో ఇటీవల ఫోన్ లో మాట్లాడారు. ఓ పని విషయమై ఎమ్మెల్యే సోదరుడు ఈఈతో మాట్లాడిన సందర్భంగా మాటా మాటా పెరిగింది. ఎమ్మెల్యే సోదరుడి వ్యాఖ్యలకు ఈఈ ఘాటుగా సమాధానమిచ్చారు.
ఈ ఆడియో సంభాషణ సోషల్ మీడియాతో పాటు మీడియాలో ప్రసారమైంది. ఈ విషయమై ఉన్నతాధికారులు ఈఈ భాస్కర్ రావుపై చర్యలు తీసుకొన్నారు. సంస్థ ప్రతిష్టను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నించినందున ఈఈ భాస్కర్ రావుపై సస్పెన్షన్ వేటేశారు అధికారులు.
ఎమ్మెల్యే సోదరుడు తనను దుర్భాషలాడిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడ అధికారులు పట్టించుకోలేదని ఈఈ ఆరోపించారు. మొత్తంగా ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని విద్యుత్ ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఎమ్మెల్యే సోదరుడితో ఈఈ ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఈఈ కూడ ఎమ్మెల్యే సోదరుడికి ఘాటుగానే సమాధానమిచ్చాడు. ఈ విషయమై ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఈఈపై చర్యలు తీసుకొనేలా చేశారని ఉద్యోగ సంఘాల నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.