జగనన్నా... ఇన్నాళ్లు గుడ్డిగుర్రాల పళ్లు తోమారా? : వైఎస్ షర్మిల  

By Arun Kumar P  |  First Published Feb 15, 2024, 12:27 PM IST

చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి అన్నారు.... వైఎస్ జగన్ వచ్చి మూడు రాజధానులు అన్నాడు... కానీ చివరకు మళ్ళీ హైదరాబాద్ నే ఉమ్మడి రాజధానిగా  కొనసాగించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. 


అమరావతి : వైసిపి అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ఒక్క రాజధాని సరిపోదంటూ మూడు రాజధానులను ఏర్పాటు నిర్ణయం తీసుకుంది. అమరావతిని కొనసాగిస్తూనే విశాఖపట్నం, కర్నూల్ లను కూడా రాజధానులుగా కొనసాగుతాయని ప్రకటించారు... ఇందుకోసం కసరత్తు కూడా చేసారు. ఇంతలో ఏమయ్యిందో తెలీదుగానీ సరిగ్గా  ఎన్నికల వేళ హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ వైసిపి కొత్తరాగం అందుకుంది. వైసిపిలో కీలక నాయకుడు వైవి సుబ్బారెడ్డి విశాఖలో పరిపాలనా రాజధాని నిర్మించేవరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించాలని డిమాండ్ చేసారు. ఈ వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. 

ఇలా హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్న వైసిపి డిమాండ్ పై ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మూడు రాజధానులు అన్నారుగా...ఇప్పుడు మళ్ళీ ఉమ్మడి రాజధాని కావాలంటున్నారేంటి? ఏం ఇన్నాళ్లు రాజధాని నిర్మాణం చేపట్టకుండా గుడ్డిగుర్రాల పళ్లు తోమారా? అంటూ జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మరో రెండేళ్లు ఉమ్మడి రాజధానిని కొనసాగించాలని కోరడమే మీ చేతగాని తనానికి నిదర్శనమని మండిపడ్డారు. 
 
ప్రజలు పూర్తి మెజారిటీతో అధికారాన్ని అప్పగిస్తే ఈ ఐదేళ్లు ఏం చేసారు? అని షర్మిల ప్రశ్నించారు. ఉన్న రాజధానిని కాదని మూడు రాజధానులు ఏర్పాటుచేస్తామని అన్నారు... ఇప్పుడు రాష్ట్రానికి రాజధానే లేకుండా చేసారని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతున్నా ఇంకా ఆంధ్రుల రాజధాని ఏదంటే హైదరాబాద్ వైపు చూసే దయనీయ పరిస్థితి వుందని షర్మిల ఆవేదన వ్యక్తం చేసారు.

Latest Videos

Also Read  ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ : గడువు ముగిశాక ఈ కొత్త వాదనేంటీ .. వైసీపీ ఎత్తుగడ వెనుక..?

రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదు... ఏనాడైనా కేంద్రాన్ని అడిగారా? అని నిలదీసారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఏదీ లేదు... మరి రాష్ట్ర అభివృద్ది ఎలా సాధ్యమని షర్మిల ఆందోళన వ్యక్తం చేసారు. పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తిచేయడం కాదుకదా కనీసం జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్టులకు కూడా దిక్కులేదని షర్మిల మండిపడ్డారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వచ్చిందిలేదు... ఉన్నవి ఉంటాయో లేదో తెలియదన్నారు. కానీ రాష్ట్ర ప్రజలపై రూ.8 లక్షల కోట్ల అప్పులు మోపి అప్పులాంధ్రప్రదేశ్ చేశారని షర్మిల అన్నారు. 

చంద్రబాబు అమరావతి పేరుతో 3D గ్రాఫిక్స్ చూపిస్తే... జగనన్న మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారన్నారు. పూటకో మాట,రోజుకో వేషం వేస్తూ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతల కుట్రలు చేస్తున్నారని... ఇప్పుడు ఎన్నికల వేళ ఉమ్మడి రాజధాని డిమాండ్ భాగమేనని అన్నారు. ఓటమి ఖాయమని తెలిసిపోయింది... అందుకే ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారని అన్నారు. వైసీపీకి రాజధానిపై గానీ... రాష్ట్ర అభివృద్ధిపై గానీ చిత్తశుద్ది లేదని వైఎస్ షర్మిల మండిపడ్డారు. 
 

click me!