ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ : గడువు ముగిశాక ఈ కొత్త వాదనేంటీ .. వైసీపీ ఎత్తుగడ వెనుక..?
వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఉమ్మడి రాజధానిపై చేసిన వ్యాఖ్యలు తెలుగు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యల వెనుక జగన్ వ్యూహం వుందన్నట్లుగా పరిశీలకులు అంటున్నారు.
వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఉమ్మడి రాజధానిపై చేసిన వ్యాఖ్యలు తెలుగు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. విశాఖలో ఏపీ ప్రభుత్వం పరిపాలనా రాజధానిగా నిర్మించేంత వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కంటిన్యూ చేయాలని ఆయన ఓ డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పటికే మూడు రాజధానుల వ్యవహారం వైసీపీని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఇలాంటి దశలో వైవీ సుబ్బారెడ్డి ఈ కొత్త వాదనను తెరపైకి తీసుకురావడం తెలుగు ప్రజలను ఆశ్చర్చానికి గురిచేసింది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజన విభజిస్తూ పార్లమెంట్ ఆమోదించిన చట్టంలో హైదరాబాద్ పదేళ్ల పాటు ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా వుంటుందని పేర్కొన్నారు.
2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగా.. కొన్నాళ్ల పాటు పరిపాలనా కార్యకలాపాలు, అసెంబ్లీ అన్నీ హైదరాబాద్ నుంచే సాగాయి. అయితే ఓటుకి నోటు కేసు నేపథ్యంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ను వదిలి అమరావతిని రాజధానిగా నిర్ణయించి రాత్రికి రాత్రి మకాం మార్చారు. సింగపూర్ సంస్థల సాయంతో మాస్టర్ ప్లాన్ రూపొందించి, తాత్కాలికంగా సెక్రటేరియేట్, శాసనసభ, శాసనమండలి, ఇతర పరిపాలనా భవనాలను నిర్మించారు. అమరావతి నిర్మాణం పూర్తి కాకుండానే చంద్రబాబు అధికారం కోల్పోయారు. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక.. ఆయన పరిపాలన, శాసన, న్యాయ రాజధానులను తెరపైకి తీసుకొచ్చారు. అయితే ఈ మూడు రాజధానుల ప్రతిపాదనలకు అమరావతి రైతులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. నెలల తరబడి ఆందోళనతో పాటు న్యాయస్థానాల్లోనూ కేసులు వేశారు.
జగన్ మాత్రం విశాఖను ఎట్టిపరిస్థితుల్లోనూ రాజధానిని చేస్తామని చెప్పి .. వచ్చేస్తున్నా, కాపురం పెట్టేస్తున్నా అంటూ భవనాల నిర్మాణాలను చేపట్టారు. ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లోనూ విశాఖ విషయం ప్రస్తావించి వేగంగా అడుగులు వేశారు. అయితే ఎన్నికల్లోపు విశాఖ పరిపాలనా రాజధాని కావడం కష్టమేనని తేలిపోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో వుంది. ఈ వివాదాలన్నీ పరిష్కారమయ్యే సమయానికి ఎన్నికలు ముగుస్తాయి. జగన్ మరోసారి సీఎం అయితే మరో మాట లేకుండా విశాఖ పరిపాలనా రాజధాని కావడం ఖాయం. అలా కాకుండా టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే మాత్రం అమరావతే ఏపీ రాజధానిగా కంటిన్యూ అవ్వడంలో ఎలాంటి సందేహం లేదు.
వాస్తవానికి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే విషయాన్ని తెలుగు ప్రజలు దాదాపుగా మార్చిపోయారు. అమరావతిని రాజధానిగా నిర్ణయించినా.. పూర్తి స్థాయిలో కార్యకలాపాలు మొదలయ్యే వరకు ఏపీ ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగానే పాలించింది. అయితే జగన్ సీఎం అయ్యాక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సచివాలయంలో కేటాయించిన భవనాలను, హైదరాబాద్‌లోని ఇతర ఆఫీసులను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించారు. దీంతో అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిని కూల్చేసి భారీ స్థాయిలో సెక్రటేరియేట్ నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఏపీకి చెందిన ఏ ఒక్క కార్యాలయం కూడా తెలంగాణ నుంచి నడవటం లేదు. ఇప్పుడు ఉమ్మడి రాజధాని కావాలంటున్న వైసీపీ నేతలు.. అప్పట్లో కరోనా రోగులు ఏపీ నుంచి హైదరాబాద్ వస్తుంటే వారిని తెలంగాణ పోలీసులు అడ్డుకుంటే ఏ మాత్రం స్పందించలేదు. అప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగానే వున్నా ఏమాత్రం వాదించలేదు.
విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న గడువు దాదాపు ముగిసిపోయింది. వైసీపీ కోరినట్లుగా ఉమ్మడి రాజధాని గడువును కేంద్రం పొడిగించినా ఇప్పుడు ఏపీకి ఎలాంటి ఉపయోగం లేదు. తెలంగాణ ప్రభుత్వం కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, ఆ రాష్ట్ర ప్రజలు కానీ ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటే ఊరుకుంటారా. అన్ని తెలిసి కూడా వైసీపీ కొత్త ఆలోచనతో జనం ముందుకు రావడం వెనుక ఏదో మర్మం వుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఆల్రెడీ టీడీపీ, బీజేపీ, జనసేనలతోపాటు తెలంగాణలోని పార్టీలు సైతం వైసీపీపై మండిపడుతున్నాయి. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ఏపీలోని అధికార పార్టీ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా ముందుకు వచ్చి.. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. చంద్రబాబు అర్ధరాత్రి పారిపోయి వచ్చిన కారణంగా రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని ఆరోపించారు. పదేళ్ల తర్వాత హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయడం ఎలా సాధ్యమవుతుందని ఎదురు ప్రశ్నించారు.
మొత్తంగా చూస్తే.. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యల వెనుక జగన్ వ్యూహం వుందన్నట్లుగా పరిశీలకులు అంటున్నారు. అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో అమరావతికి ఏం చేయకపోగా, మూడు రాజధానుల విషయంలోనూ అడుగు ముందుకు పడకపోవడంతో వైసీపీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఎన్నికల ప్రచారంలో రాజధాని అంశంపై విపక్షాలు విమర్శలు చేసే అవకాశం వుండటంతో.. హైదరాబాద్‌పై ఏపీకి హక్కు వుందన్న విషయాన్ని లేవనెత్తి.. ప్రజల్లో సెంటిమెంట్ రగిలించాలని వైసీపీ భావిస్తుండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడేకొద్ది దీనిపై మరింత చర్చ జరిగేలా వైసీపీ యాక్షన్ ప్లాన్ వుండొచ్చంటున్నారు పరిశీలకులు.