స్వరం మార్చిన రఘువీరారెడ్డి: టీడీపీతో పొత్తు లేనట్టే

By Nagaraju TFirst Published Jan 12, 2019, 5:43 PM IST
Highlights

ఏపీలో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పొత్తు బెడిసికొట్టిందా...? కాంగ్రెస్ తో పొత్తు కేవలం తెలంగాణ, జాతీయ రాజకీయాల వరకు మాత్రమే పరిమితమా...?  ఏపీలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందా...? నిన్నటి వరకు టీడీపీని విమర్శించని కాంగ్రెస్ నేడు విమర్శించడం వెనుక ఆంతర్యం ఏంటి...? 
 

విజయవాడ: ఏపీలో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పొత్తు బెడిసికొట్టిందా...? కాంగ్రెస్ తో పొత్తు కేవలం తెలంగాణ, జాతీయ రాజకీయాల వరకు మాత్రమే పరిమితమా...?  ఏపీలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందా...? నిన్నటి వరకు టీడీపీని విమర్శించని కాంగ్రెస్ నేడు విమర్శించడం వెనుక ఆంతర్యం ఏంటి...? 

ఇండైరెక్ట్ గా పొత్తు లేదని చెప్పడమేనా అంటే అవుననే అనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకున్న నాటి నుంచి ఏపీలో పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి కానీ, అటు ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ఒక్క విమర్శ చెయ్యకుండా జాగ్రత్త పడుతున్నారు. 

తెలుగుదేశం పార్టీపై ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అండ్ కో అయితే కాంగ్రెస్ పార్టీని తెగ పొగిడేస్తున్నాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలిసి బీజేపీపై పోరాడేందుకు రెడీ అయిన తెలుగుదేశం పార్టీ ఇక ఏపీలో ఒంటిరిగానే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

అందుకు నిదర్శనం ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి వ్యాఖ్యలే. విజయవాడలో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రఘువీరారెడ్డి తన స్వరం మార్చారు. టీడీపీ పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల వరకే తెలుగుదేశం పార్టీ, బీజేపీల జిమ్మిక్కులంటూ విరుచుకుపడ్డారు. 

ఎన్నికల అనంతరం టీడీపీ, బీజేపీల నడ్డివిరిచేందుకు ప్రజలు రెడీగా ఉన్నారంటూ విమర్శించారు. మరోవైపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేసి తీరుతుందని  రఘువీరారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

హోదా ఇవ్వకపోతే తాను, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏపీలో అడుగుపెట్టబోమని శపథం చేశారు. విభజన హామీలను అమలుపరిచే నిజాయితీ ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని తెలిపారు. ఏపీలో నిరుద్యోగ సమస్య తాండవిస్తోందని ఆరోపించారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే నిరుద్యోగులకు ఉపాధి లభించేదని రఘువీరారెడ్డి అభిప్రాయపడ్డారు. 
 

click me!