
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలోని మహిళలపైనే కాదు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఇంటి మహిళలను కించపర్చేలా ఎవరు వ్యాఖ్యలు చేసినా అది తప్పేనని ఏపీ మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. మహిళలను కించపర్చేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని అన్నారు. పార్టీ ఏదయినా... రాజకీయంగానే కాదు వ్యక్తిగతంగా శతృత్వం వున్నా... నాయకులు, కార్యకర్తలు కుటుంబసభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టకూడదని వాసిరెడ్డి పద్మ సూచించారు.
ఆంధ్ర ప్రదేశ్ ఉమెన్ కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆధ్యక్షతన సెక్రేటరియట్ లో మహిళల ఆత్మగౌరవ దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహిళలపై సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులపై చర్చ జరిగింది. సాటి మహిళలపై కొందరు మహిళా నాయకులు రాజకీయాల కోసం అసభ్యంగా చేస్తున్న పోస్టులపై చర్చించారు.మహిళలు ఆత్మగౌరవంతో జీవించడంపై తీసుకోవాల్సిన చర్యలపై సెక్రటేరియట్ మహిళా ఉద్యోగినులు, అధికారుల సూచనలు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ... ఎంతో అబివృద్ది సాధించిన ఈ అధునాతన సమాజంలో ఇంకా మహిళ పట్ల మద్యయుగం మనస్తత్వం పోలేదన్నారు. మహిళలుమాట్లాడితే చాలు సోషల్ మీడియాలో అవమానించే పోస్టులు పెట్టే బ్యాచ్ తయారయ్యిందని అన్నారు. మహిళలను ముందుకు తీసుకువెళ్లాల్సింది పోయి సోషల్ మీడియా వేదికగా వెనక్కి లాగాలని చూస్తున్నారని... ఇవి చూసి బెదరవద్దని మహిళా కమీషన్ చైర్ పర్సన్ సూచించారు.
Read More సైకో జగన్ ముద్దులు కాస్తా గుద్దులుగా మారాయి..: టిడిపి అనిత
టిడిపి నాయకురాలు శ్వేతా చౌదరితో పాటు మరికొందరు మహిళలు వైసిపి నాయకుల ఇంట్లోని మహిళలపై అసభ్యకర కామెంట్లు, సోషల్ మీడియా పోస్టింగ్ లు చేస్తున్నారని... ఇది మంచిది కాదని వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. తాజాగా ఓ టిడిపి నాయకురాలు సంక్షేమ పథకాలు కావాలంటే పక్కన పడుకోవాలని వాలంటీర్లు అంటున్నారని అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు. మహిళల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడటం తగదని పద్మ హెచ్చరించారు.
వాలంటీర్లు, మహిళల భద్రత గురించి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాట్లాడారని... దీనిపై వివరణ ఇవ్వాలని మహిళా కమీషన్ కోరిందని వాసిరెడ్డి పద్మ గుర్తుచేసారు. తమ నోటీసులను పవన్ పట్టించుకోవడం లేదని... మహిళా కమీషన్ ను గౌరవించడం లేదని అన్నారు. ఒకరిద్దరు వాలంటేర్లు తప్పు చేస్తే వ్యవస్థ మొత్తాన్ని రద్దు చేయాలా..? వైసిపి మహిళా నాయకుల మీద కూడా జనసేన కార్యకర్తలు ట్రోల్స్ చేస్తున్నారు... అందుకు జనసేన పార్టీనే రద్దు చేస్తారా? అని పవన్ ను ప్రశ్నించారు. కేవలం తప్పుచేసిన వారిని శిక్షించాలి తప్ప వ్యవస్థలనే రద్దు చేసుకుంటూ పోలేమన్నారు.
పవన్ కళ్యాణ్ వాలంటీర్ల పై దారుణమైన ఆరోపణలు చేసారు కాబట్టే ఆధారాలు చూపమన్నామని అన్నారు. వితంతువులు, ఒంటరి మహిళల వివరాలను సంఘ విద్రోహ శక్తులకు వాలంటీర్లు ఇస్తున్నారన్న ఆరోపణలు దారుణమైనవని అన్నారు. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని వాలంటీర్లు, మహిళలకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేసారు.