ఏపీకి తప్పిన వాయు'గండం'... వాతావరణ శాఖ గుడ్ న్యూస్

By Arun Kumar PFirst Published Nov 16, 2021, 10:11 AM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఇటీవల వాయుగుండం ముప్పు పొంచివుందని హెచ్చరించిన వాతావరణ శాఖ తాజాగా ఆ ముప్పు తప్పిందని తాజాగా ప్రకటించింది. 

అమరావతి: మరో వాయుగుండం పొంచివుందన్న వాతావరణ శాఖ ప్రకటన నేపథ్యంలో ఆందోళన చెందుతున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్. బంగాళాఖాతంలో ఇప్పటికే ఏర్పడిన అల్పపీడనం బలపడే పరిస్థితులు లేవని వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి వాయుగుండం ఏర్పడే అవకాశం లేదని ప్రకటించారు. అయితే అల్పపీడనం ప్రభావంతో కోసాంధ్రలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ ప్రకటించింది. 

ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. అనంతరం దాదాపు పశ్చిమ దిశగా పయనిస్తూ ఈనెల 18వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలో దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడులకు చేరువగా కేంద్రీకృతం అవుతుందని తెలిపారు. అయితే ఈ అల్పపీడనం మొదట వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేసామని... కానీ అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడినందున ఇది బలపడే అనుకూలత లోపించిందని వాతావరణ శాఖ తెలిపింది. 

బంగాళాఖాతంలోని కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో నేడు(మంగళవారం) కోస్తాంధ్రలో తేలికపాటినుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. దక్షిణ కోస్తాలో మాత్రం అక్కడక్కడ భారీ వర్షాలు పడవచ్చని తెలిపారు. ఇక రేపు. ఎల్లుండీ ఆ తర్వాత మరో రెండు రోజులూ దక్షిణ కోస్తాలో భారీనుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

read more  పొంచివున్న మరో వాయుగుండం... ఏపీలోనే తీరం దాటే ప్రమాదం: వాతావరణ శాఖ హెచ్చరిక

ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న ఆంధ్ర ప్రదేశ్ కు మరో వాయుగుండ ప్రమాదం పొంచివుందని గతంలో అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్ననే(సోమవారం) వాయుగుండంగా మారుతుందని ప్రకటించినా వాతావరణ పరిస్థితుల మార్పు కారణంగా ఆ ముప్పు తప్పిందని వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది. 

వాయుగుండం ఏర్పడితే అది ఆంధ్ర ప్రదేశ్ లోనే తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్ర ప్రకటించింది. వాయుగుండం తీరందాటే సమయంలో మాత్రం అల్లకల్లోలం సృష్టించే అవకాశాలుండటంతో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించింది. అయితే వాయుగుండం ఏర్పడే అవకాశాలు లేవు కాబట్టి తీరప్రాంత ప్రజలు ఆందోళనకు గురికావద్దని వాతావరణ శాఖ తాజాగా తెలిపింది. 

అయితే వాయుగుండం ఏర్పడకున్నా ఏపీకి భారీ వర్షాల ముప్పు పొంచివుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఐదురోజులు కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో  భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే కోస్తాంధ్ర ప్రజలతో పాటు అధికారులు అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.  

read more  చిత్తూరు, నెల్లూరు జిల్లాలను కుదిపేసిన భారీ వర్షం: స్తంభించిన జనజీవనం, రూ.కోట్లలో నష్టం

ఇటీవల ఏపీలోని పలు జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతలం చేసాయి. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలను వర్షాలు ముంచెత్తాయి. స్కూళ్లకు సెలవులు ప్రకటించడం, తిరుమల ఆలయానికి వెళ్లే నడకమార్గాన్ని మూసివేసారంటేనే ఏ స్థాయిలో వర్షాలు కురిసాయో అర్థంచేసుకోవచ్చు. వర్షప్రభావం ఎక్కువగా వున్న జిల్లాల్లో నదులు, వాగులు వంకలు ప్రమాదకరరీతితో ప్రవహించాయి. దీంతో పలు ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయి. 

ఈ వర్షాల నుండి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజలకు మరో వాయుగుండం పొంచివుందన్న వార్త తీవ్ర ఆందోళన కలిగించింది. అయితే వాతావరణ పరిస్థితులు మారడంతో వాయుగుండం ఏర్పడే అవకాశాలు లేవని వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. 


 

click me!