AP train accident: తొమ్మిదికి చేరిన మ‌ర‌ణాలు.. బాధిత కుటుంబాల‌కు రూ.10 ల‌క్ష‌ల సాయం

By Mahesh Rajamoni  |  First Published Oct 30, 2023, 4:23 AM IST

AP train accident: హౌరా-చెన్నై లైన్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో రైలు సిగ్నల్‌ను అధిగమించి మరొక రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాయగడ ప్యాసింజర్‌కు చెందిన మూడు భోగీలు పట్టాలు తప్పాయి. దీంతో ఈ ప్ర‌మాదంలో చ‌నిపోయిన వారి సంఖ్య 9కి చేరింది. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే రైలు అవశేషాలలో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించడానికి అత్యవసర కార్మికులు, స్థానిక వాలంటీర్లు స‌హాయ‌క  చ‌ర్య‌లు చేప‌ట్టారు.
 


AP Train Accident: విశాఖపట్నం నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఆదివారం విశాఖపట్నం వెళ్తున్న మరో రైలు పలాస ఎక్స్ ప్రెస్ ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 9 మంది మృతి చెందగా, 32 మంది గాయపడ్డారు. రైళ్లు ఢీకొనడంతో ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో బోగీలు పట్టాలు తప్పాయని సంబంధిత అధికారులు తెలిపారు. ప్ర‌మాదం నేప‌థ్యంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డితో మాట్లాడి సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ప్రధాని న‌రేంద్ర‌ మోడీ పరిస్థితిని సమీక్షించారు. తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రితో మాట్లాడాన‌నీ, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఈ రైళ్లు ఢీకొనడంతో విశాఖ-పలాస ప్యాసింజర్ రైలు వెనుక బోగీలు, విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైలు ఇంజిన్ పట్టాలు తప్పాయి. ఈ ప్ర‌మాద‌ ఘటనలో 9 మంది మృతి చెందారు. రైలు ప్ర‌మాదం నేప‌థ్యంలో బోగీల శిథిలాల కింద చిక్కుకున్న ప్రయాణికులను రక్షించేందుకు అత్యవసర సిబ్బంది, స్థానిక వాలంటీర్లు ఆదివారం రాత్రి శిథిలాల కోసం గాలింపు చేపట్టారు.

Latest Videos

undefined

నలిగిపోయిన, బోల్తా పడిన బోగీలు, ఎమర్జెన్సీ వర్కర్లు చీకట్లో క్షతగాత్రులను రక్షించేందుకు కష్టపడుతున్న దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.  ప్ర‌మాదం కారణంగా విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయని స్థానిక అధికారులు తెలిపారు. మానవ తప్పిదమే కారణమ‌ని ఆంధ్రా రైలు ప్రమాదంపై ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రతినిధి ఒక‌రు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో రెండు రైళ్లు ఢీకొనడానికి మానవ తప్పిదమే కారణమని ఈస్ట్ కోస్ట్ రైల్వే (ఈసీఓఆర్) తెలిపింది. ఈ ప్ర‌మాదంలో  క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించే ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ద‌నీ, రైలు ప్రమాదంలో గాయపడిన వారందరినీ ఆస్పత్రులకు తరలించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రగాయాలైన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వ‌నున్న‌ట్టు ఏపీ ప్ర‌భుత్వం తెలిపింది. రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ము ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో ప్రాణనష్టం జరగడం బాధాకరమని అన్నారు. బాధిత కుటుంబాల‌కు అండగా ఉంటామ‌నీ, క్ష‌త‌గాత్రులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థించారు.

click me!