
మంగళగిరి: మహిళల రక్షణ కోసం గన్ కంటే జగన్ ముందువస్తాడన్నారు... మరి ఆ గన్ను ఇప్పుడు తుప్పుపట్టిపోయిందా? అంటూ ఏపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత (vangaapudi anitha) ఎద్దేవా చేసారు. విజయవాడ (vijayawada)లో బాలిక ఆత్మహత్య చేసుకుంటే రాజకీయం చేయడానికి వైసీపీ నేతలు బయటకు వచ్చారు... మరి నరసరావుపేటలో అనూష, విజయవాడలో తేజస్విని, పులివెందులలో నాగమ్మ, విశాఖలో లక్ష్మి, అనంతపురంలో స్నేహలత ఇలా ఎందరో ఆడబిడ్డలు చనిపోయినప్పుడు వెలగని కొవ్వొత్తులు ఇవాళ వెలుగుతున్నాయా? అని అనిత నిలదీసారు.
వైసిపి (ycp) పాలనలో మహిళలపై జరుగుతున్న దాడుకుల నిరసనగా మంగళగిరిలోకి టిడిపి (TDP) కార్యాలయంలో తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో 'నారీ సంకల్ప దీక్ష' (nari sankalpa deeksha)దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ... రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో అనేక అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటే ఒక్కసారయినా వైసిపి నాయకులు స్పందించలేదన్నారు. కానీ ఇప్పుడు రాజకీయాల కోసమే వైసీపీ పేటీఎమ్ కుక్కలు మొరుగుతున్నాయన్నారు.
''నిండుసభలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం చంద్రబాబు (nara chandrababu) సతీమణిపైనే దిగజారి మాట్లాడారు కాలకేయ వైసీపీ నేతలు, మంత్రులు. దీన్నిబట్టే వీరు ఎవరినీ వదలరని... మన గురించీ నీచంగా మాట్లాతారని అర్ధమవుతోంది. అయితే మనం భయపడకుండా ఇలాంటి ఇడియట్స్ ని ఉక్కు సంకల్పంతో కాళ్ల కింద చెప్పుల్లా నలిపేయాలి'' అని మహిళలకు అనిత సూచించారు.
మహిళాద్రోహి జగన్మోహన్ రెడ్డి పాలనకు చరమగీతం పాడాలి అనే లక్ష్యంతో అధినేత చంద్రబాబు ఆదేశాలతో నారీ సంకల్ప దీక్ష చేపట్టాము. రాబోయే కాలంలో మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు చేస్తే చూస్తు ఊరుకోబోము. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ధైర్యంగా గుండెలపై చేయి వేసుకొని నిద్రపోలేని దుస్థితి. చేతకాని, దద్దమ్మ, సైకో ముఖ్యమంత్రి పాలన వల్లే ఇన్ని ఇబ్బందులు'' అని మండిపడ్డారు.
''రోజూ ఉదయం లేవగానే ఏ వార్త వినాల్సి వస్తోందనే భయంతో అందరూ మహిళలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ప్రతి మహిళ బయటకొచ్చి హక్కుల కోసం పోరాటం చేయాలి. మనల్ని మనం రక్షించుకోవాలి. అవినీతి జగన్ పాలనకు చరమగీతం పాడాలనే ఉద్దేశంతో దీక్షకు వచ్చిన ప్రతిమహిళకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నాతో పాటు స్టేట్ కమిటీలో ఉన్న వారిలో సుమారు 100మంది వరకూ దీక్షలో పాల్గొన్నారు'' అని తెలిపారు.
''జగన్మోహన్ రెడ్డి మహిళలకు అండగా నిలబడతాడేమోనని రెండున్నరేళ్లుగా వేచి చూశాం. ఉపయోగం లేకుండా పోయింది. అందుకే సమర భేరి మోగించాం. పాదయాత్ర సమయంలో మహిళలకు ముద్దులు పెడుతూ తల నిమిరాడు. ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేశాడు. మన ఎమోషన్స్ తో ఆడుకున్నాడు. అధికారంలోకి రాగానే మద్యపాన నిషేదం చేస్తాను, అక్కచెల్లెమ్మల కళ్లలో ఆనందం చూస్తానని నమ్మబలికాడు. తీరా అధికారంలోకి వచ్చాక మాట తప్పాడు. మడమ తిప్పాడు. కరెంటు షాకు కొట్టేలా ధరలు ఉండాలని లిక్కర్ రేట్లు పెంచానన్నాడు. అన్నీ అబద్ధాలే. తన జేబులు, బినామీల జేబులు నింపుకుంటున్నాడు. నాశిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యంతో చలగాటమాడుతున్నాడు. ఇంటిని, వంటిని, రాష్ట్రాన్ని గుల్ల చేస్తుంటే మనం చూస్తూ ఊరుకోవాలా?'' అని అనిత నిలదీసారు.
''కరోనా విపత్తులో మద్యం షాపులు ఓపెన్ చేసింది దేశం మొత్తంలో జగన్ రెడ్డే. మద్యం షాపుల దగ్గర చదువులు చెప్పే టీచర్లను కాపలాపెట్టాడు. నకిలీ బ్రాండ్లు తాగుతున్న వైసీపీ నేతలు పిచ్చి వాగుడు వాగుతున్నారు. వైసీపీ నేతల తీరు, వారు మాట్లాడే మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది'' అని మండిపడ్డారు.
''విజయవాడలో బాలిక ఆత్మహత్య చేసుకుంటే అధికారంలో ఉండీ నిందితుణ్ణి శిక్షించకపోగా మంత్రులు మొదలు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేస్తారా? ఆడబిడ్డ జీవితాన్ని కూడా రాజకీయం చేయడానికి సిగ్గుందా? రెండున్నరేళ్లలో 1500కు పైగా అత్యాచార ఘటనలు నమోదైతే ఏం చేశారు చర్యలు తీసుకోకుండా?'' అని ప్రశ్నించారు.
''ప్రతిరోజూ ఒక ఆడబిడ్డపై అత్యాచారమో, లైంగిక దాడో జరిగింది. ఇంత జరుగుతుంటే రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్న సుచరిత నిస్సహాయ స్థితిలో ఉన్నారు. మహిళకు అన్యాయం జరిగితే రోడ్డు మీదకు వచ్చి మాట్లాడలేని దుస్థితిలో హోంమంత్రి, మహిళా కమిషన్, వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. నా గుండె లబ్ డబ్ అని కొట్టుకోవడం లేదు-జగనన్న అని కొట్టుకుంటోంది అని ఓ మహిళా ఎమ్మెల్యే అన్నారు. ఏమ్మా.. రాష్ట్రంలో అన్యాయమైపోతున్న ఆడబిడ్డలు, కన్నపేగును పోగుట్టుకున్న తల్లుల గర్భశోకం నీకు వినిపించడం లేదా? అమరావతి మహిళా రైతులను కాళ్ల బూట్లతో పోలీసులు తన్నితే ఆ ఎమ్మెల్యే గుండె జగన్ జగన్ అనే కొట్టుకుంది'' అని వంగలపూడి అనిత మండిపడ్డారు.