
విజయవాడ: ఓ నీచుడి లైంగిక వేధింపులను భరించలేక విజయవాడలో 9వ తరగతి విద్యార్థిణి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బాలిక మృతికి ఓ రాజకీయ పార్టీ నాయకుడే కారణం కావడంతో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లోనూ కలకలం రేపుతోంది. తాజాగా బాలిక ఆత్మహత్య (vijayawada minor suicide)పై ఏపీ టిడిపి (TDP) అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (atchannaidu) స్పందిస్తూ అధికార వైసీపీ (ysrcp) నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
''వైసీపీ ప్రభుత్వ దిగజారుడు రాజకీయాలకు అంతే లేకుండాపోతోంది. విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న 9వ తరగతి బాలిక ఘటనలో కూడా రాజకీయ లబ్ధిపొందేందుకు అధికార పార్టీ నేతలు ప్రాకులాడటం నీచమైన చర్య. విషయం తెలిసిన వెంటనే నిందితుడు వినోద్ జైన్ (vinod jain) ను టిడిపి నుంచి సస్పెండ్ చేశాము. ఇప్పటికే బాధిత కుటుంబాన్ని తెలుగు మహిళా విభాగం ప్రతినిధులు పరామర్శించారు'' అని అచ్చెన్న తెలిపారు.
''ఆడబిడ్డలకు అండగా నిలబడటం చేతకాని మీరు మాపై విమర్శలు చేయడం సిగ్గుచేటు. గడిచిన రెండున్నరేళ్లలో మహిళలు, చిన్నారులు, వృద్ధులపై అఘాయిత్యాలు, లైంగిక దాడులు జరిగితే ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదు. బాధితులకు అండగా నిలబడలేదు'' అని అన్నారు.
''ఓ బాలిక జీవితాన్ని చిదిమేసిన కేసులో అరెస్టయిన వైసీపీ నేత కన్నా భూశంకర్ రావు (bhushankar rao) ను దిశా చట్టం (disha act) కింద ఎందుకు ఉరితీయలేదు? విశాఖ జిల్లాలో ఓ బాలికను కామాంధుడు అత్యాచారం చేస్తే దిక్కులేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితుడిని శిక్షించకపోవడంతో మనస్థాపం చెందిన బాలిక తండ్రి ఆత్మహత్యాయత్నం చేయడం దేనికి సంకేతం? దిశా చట్టం కింద మీరు నిందితులకు ఉరివేయరని తెలుసుకున్న బాధితులే ఉరివేసుకుంటున్న పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి చేతకానితనం కారణం కాదా?'' అంటూ నిలదీసారు.
''ఇప్పటికైనా మహిళా భద్రతపై ముఖ్యమంత్రి జగన్ దృష్టి పెట్టాలి. ఊరికొకరున్న భూశంకర్ రావు లాంటి వాళ్లను శిక్షించాలి. మహిళలు, అభంశుభం తెలియని చిన్నారుల జీవితాలను నాశనం చేస్తున్న మానవ మృగాలను కఠినంగా శిక్షించాలి'' అని అచ్చెన్నాయుడు డిమాండ్ చేసారు.
బాలిక ఆత్మహత్యకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విజయవాడ నగరంలోని భవానిపురం కుమ్మరిపాలెం సెంటర్‌లో నివాసం ఉంటున్న బాలిక.. బెంజి సర్కిల్ వద్దగల ఒక పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. అయితే తనను ఓ వ్యక్తి గత కొన్ని రోజులు వేధిస్తున్నాడని నోట్ బుక్‌లో రాసి బాలిక అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. రక్తపు మడుగులో పడివున్న బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మహత్యకు పాల్పడక ముందు ముందు టెర్రస్‌పై 20 నిమిషాల పాటు బాలిక అటూ ఇటూ తిరుగుతూ సీసీ టీవీ కెమెరాల్లో కనిపించిందని పోలీసులు వెల్లడించారు. నిందితుడు వినోద్ జైన్ ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 37వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేశాడు. గత రెండు నెలల నుంచి బాలికను వినోద్ జైన్ వేధిస్తున్నాడని… పలు సార్లు లైంగిక దాడికి కూడా పాల్పడ్డాడని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అతడి వేధింపులు తట్టుకోలేక బాలిక ఆత్మహత్య చేసుకుందని వారు చెప్తున్నారు. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.