జగన్ ప్రభుత్వంలో అన్నీ కోతలే: కళా వెంకట్రావు

By Siva KodatiFirst Published Jun 27, 2019, 7:41 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎవరి మీదో నింద వేయాలనే అజెండాతోనే సీఎం సమీక్షలు చేస్తున్నారని ఆరోపించారు.

గతంలో తమ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే విద్యుత్ కొనుగోళ్లు జరిపిందని ఆయన గుర్తు చేశారు. వైఎస్ హయాంలోనూ టీడీపీ పాలనపై అనేక ఉప సంఘాలు వేశారని.. అప్పుడు అన్నీ సక్రమమేనని రుజువయ్యాయన్నారు.

ఇప్పుడు అదే తరహాలో జగన్ విచారణలు అంటున్నారని.. ఇది రాజకీయ కక్ష, అనాలోచిత నిర్ణయం తప్ప మరోకటి కాదని వెంకట్రావ్ దుయ్యబట్టారు. ఈ తరహా పున:సమీక్షలతో పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోవడంతో పాటు అభివృద్ధి కుంటుపడుతుందన్నారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సక్రమంగా విద్యుత్ ఇవ్వలేకపోతున్నారని.. కొత్త ప్రభుత్వంలో విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చీ రాగానే విద్యుత్ లోటును అధిగమించి నిరంతరాయ విద్యుత్‌కి శ్రీకారం చుట్టారని వెంకట్రావు గుర్తుచేశారు.

టీడీపీ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ అనేక అవార్డులు సాధించిందన్నారు. ఎలాంటి అక్రమాలు లేనందునే విద్యుత్ రంగంలో ఎన్నో విజయాలు అందుకున్నామని కళా వెంకట్రావు స్పష్టం చేశారు. 

click me!