ఖబర్దార్ జగన్ రెడ్డి... ఇంతకింతా బదులు తీర్చుకుంటాం: అచ్చెన్న స్ట్రాంగ్ వార్నింగ్

By Arun Kumar P  |  First Published Sep 17, 2021, 2:28 PM IST

టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు ఇంటి ముట్టడికి వైసిపి శ్రేణులు ప్రయత్నించడం దారుణమన్నారు అచ్చెన్నాయుడు. ఖబడ్దార్ జగన్మోహన్ రెడ్డీ... భవిష్యత్ లో ఇంతకింతా బదులు తీర్చుకుంటాం అని హెచ్చరించారు.


అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చేశారని టీడీపీ ఏపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి ముట్టడికి వైసీపీ గూండాలు ప్రయత్నించడం దారుణం. ఈ దుర్మార్గపు చర్యలే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మంటగలిసింది అనడానికి నిదర్శనమని అచ్చెన్న అన్నారు. 

''రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవనడానికి తాజా ఘటనే నిదర్శనం. ఫ్యాక్షన్ రాజకీయాలకు అలవాటుపడిన జగన్ రెడ్డి ఏపీని ఆఫ్ఘనిస్థాన్ గా మార్చేశారు. వైసీపీ నేతలు తాలిబన్లను మించిపోయారు.  వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనపై ప్రతిపక్షంగా మాట్లాడటం తప్పా? ప్రజా సమస్యలపై నిలదీస్తే గూండాగిరి చేస్తారా? జోగి రమేష్ ఎమ్మెల్యేనా లేక గూండానా?'' అంటూ మండిపడ్డారు.

Latest Videos

 చంద్రబాబు ఇంటివద్ద వైసిపి, టిడిపి ఘర్షణ... రోడ్డుపైనే సొమ్మసిల్లి పడిపోయిన బుద్దా వెంకన్న (ఫోటోలు)

''రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి , జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబు ఇంటిపైకి రౌడీ మూకలను వేసుకొచ్చి రాళ్ల దాడి చేయడమేంటి? దాడిని అడ్డుకున్న టీడీపీ నేతలపైనా రాళ్ల దాడి చేయడం మరింత అరాచకం. ఇలాంటి పాలన ఇక్కడే చూస్తున్నాం'' అన్నారు. 

''రెండున్నరేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అధికారాన్ని, పోలీసులను గుప్పిట్లో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఇలాంటి దాడులకు ప్రోత్సహిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేయాలి. లేదంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగుతాం. ఖబడ్దార్ జగన్మోహన్ రెడ్డీ... ఇంతకింతా బదులు తీర్చుకుంటాం'' అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

 చంద్రబాబు ఇంటివద్ద జరిగిన టిడిపి, వైసిపి శ్రేణుల ఘర్షణలో మాజీ ఎమ్మెల్యే బుద్దా వెంకన్న స్వల్పంగా గాయపడ్డారు. వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ నేత్రుత్వంలో ఆ పార్టీ నాయకులు చంద్రబాబు ఇంటి ముట్టడికి ప్రయత్నించగా వారిని నిలువరించేందుకు స్వయంగా బుద్దా వెంకన్న రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే టిడిపి, వైసిపి శ్రేణుల మధ్య తోపులాట, పరస్పరం కర్రలు, రాళ్లతో దాడి చోటుచేసుకుంది. దీంతో బుద్దా వెంకన్న సొమ్మసిల్లి రోడ్డుపైనే పడిపోయారు. 

వైసిపి ఎమ్మెల్యే  జోగి రమేష్ పై టిడిపి కార్యకర్తలు దాడి చేశారు. రాళ్ళదాడిలో ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. టీడీపీ, వైసిపి నాయకులు పరస్పరం తోపులాటకు దిగి రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ రాళ్ల దాడిలో పలువురు నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. వైసీపీ కార్యకర్తలు వీధిరౌడీల్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ నాయకుల ఆగ్రహం వ్యక్తం చేశారు.  

click me!