నా బిడ్డల జోలికొస్తే వైసీపీకి మూడినట్లే: అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్

By Arun Kumar PFirst Published Jul 4, 2021, 10:39 AM IST
Highlights

రాష్ట్ర పోలీసులు ఖాకీ చొక్కాలతో ప్రజలకు సేవ చేస్తున్నారో... నీలి బ్యాచ్ కు బానిసలుగా ఉన్నారో అర్ధం కావడం లేదంటూ టిడిపి నాయకులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 
 

అమరావతి: గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం కంభంపాడులో నిర్మిస్తున్న ప్రభుత్వ గృహాల విద్యుత్ లైన్ల ఏర్పాటు విషయంలో తలెత్తిన ఘర్షణలో టీడీపీ నేతలపై కేసులు నమోదు చేయడం దుర్మార్గమని ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్ర పోలీసులు ఖాకీ చొక్కాలతో ప్రజలకు సేవ చేస్తున్నారో... నీలి బ్యాచ్ కు బానిసలుగా ఉన్నారో అర్ధం కావడం లేదంటూ మండిపడ్డారు. 

''భారత రాజ్యాంగం ప్రకారం, పోలీసు చట్టాల ప్రకారం బాధితులకు న్యాయం చేయడం ప్రథమ కర్తవ్యం. కానీ ఇళ్ల స్థలాలకు వేసే విద్యుత్ లైన్లను తమ పొలాల గుండా వేస్తే.. ఇబ్బంది ఎదురవుతుందన్నందుకు తెలుగుదేశం పార్టీకి చెందిన ఆరుగురు రైతులపై కేసులు నమోదు చేయడం అత్యంత దారుణం. ఒక రైతుగా తన పొలం నాశనమైపోతుంటే.. చూస్తూ ఊరుకోవాలా.?'' అని ప్రశ్నించారు. 

read more  జల వివాదం.. 40 ఏళ్ల అనుభవానికి, తెలివి తక్కువ ప్రభుత్వానికి తేడా ఇదే: జగన్‌పై దేవినేని విమర్శలు

''ఇళ్ల నిర్మాణాల విషయంలో అంత చిత్తశుద్ధి ఉంటే అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలి. ఎవరికీ నష్టం జరగని విధంగా విద్యుత్ లైన్లు వేయాలి. అంతేగానీ.. ఎవరేమైపోయినా అనవసరం అనేలా వైసీపీ నేతలు వ్యవహరించడం సరికాదు. పొలం మధ్యలో విద్యుత్ లైన్లు వేస్తే దుక్కి దున్నడానికి, నారు పోయడానికి, చివరికి కోతలకు కూడా ఇబ్బందవుతుందనే విషయం నీలి బ్యాచ్ కు తెలియదా.? తెలిసీ.. కక్ష పూరితంగా వ్యవహరిస్తామంటే తీవ్ర చర్యలుంటాయి'' అని హెచ్చరించారు. 

''తెలుగుదేశం పార్టీలోని ప్రతి కార్యకర్తా.. నా బిడ్డతో సమానం. అలాంటి నా బిడ్డల జోలికొస్తే.. బులుగు బ్యాచ్ కు కాలం మూడినట్లేనని గుర్తుంచుకోవాలి. టీడీపీ శ్రేణులపై నమోదు చేసిన కేసులు వెంటనే విత్ డ్రా చేయాలి. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలి'' అని అచ్చెన్న డిమాండ్ చేశారు. 

click me!