జైల్లోంచి బయటకు వస్తూ భావోద్వేగం... కంటతడిపెట్టిన అచ్చెన్నాయుడు

By Arun Kumar PFirst Published Feb 9, 2021, 11:55 AM IST
Highlights

సోమవారమే బెయిల్ లభించినప్పటికి ఇవాళ(మంగళవారం) ఉదయం జైలు నుండి బయటకు వచ్చిన అచ్చెన్నాయుడు బాగా ఉద్వేగానికి లోనయ్యారు. జైల్లోంచి బయటకు వస్తూనే కంటతడి పెట్టుకున్నారు.  

శ్రీకాకుళం: స్వగ్రామం నిమ్మాడలో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధి అప్పన్నను నామినేషన్ దాఖలు చేయకుండా అడ్డుకొన్నారనే కేసులో అరెస్టయిన ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జైలు నుండి విడుదయ్యారు.  సోమవారమే బెయిల్ లభించినప్పటికి ఇవాళ(మంగళవారం) ఉదయం జైలు నుండి బయటకు వచ్చిన ఆయన బాగా ఉద్వేగానికి లోనయ్యారు. జైల్లోంచి బయటకు వస్తూనే అనుచరులు,కార్యకర్తలను చూసి కంటతడి పెట్టుకున్నారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సంబంధం లేని కేసులో ఇరికించారని అన్నారు. పోలీసు వ్యవస్థ ను చూస్తే సిగ్గేస్తుందని...జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆ ఉద్యోగానికి అనర్హుడన్నారు. తాను బెదిరించానో లేదో... ఆడియో విని చెప్పాలన్నారు.

''నాపై ఇంత దారుణంగా వ్యవహరించినా అనుభవమున్న తమ్మినేని, ధర్మాన సోదరులు ఎందుకు మౌనం వహించారు. వారి అనుభవం ఏమయ్యింది. ప్రజాస్వామ్యం లో ప్రజలు ఓటుతో సమాధానం చెప్పాలి.పులిని బోనులో బంధించి ఏకగ్రీవం చేసుకోవాలన్న ప్రయత్నాన్ని కార్యకర్తలు తిప్పి కొట్టారు'' అన్నారు. 

పంచాయితీ ఎన్నికల్లో ఫోటీ చేయాలని భావించిన అభ్యర్థిని బెదిరించాడంటూ ఫిబ్రవరి రెండో తేదీన అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజు ఆయనను కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల పాటు రిమాండ్  విధించింది.

అయితే ఇటీవల అచ్చెన్నాయుడు తరపు న్యాయవాది దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత సోమవారం నాడు బెయిల్ మంజూరు చేస్తూ సోంపేట అదనపు జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. అచ్చెన్నాయుడితో పాటు మరో 21 మందికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 50 వేల పూచీకత్తుతో అచ్చెన్న బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. కోర్టు బెయిల్  మంజూరు చేయడంతో మంగళవారం  ఉదయం జైలు నుండి అచ్చెన్నాయుడు విడుదలయ్యారు. 

read more   జైలునుండి విడుదలైన అచ్చెన్నాయుడు... ఫోన్ చేసిన చంద్రబాబు

జైలు నుండి బయటకు వచ్చిన అచ్చెన్నాయుడికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్‌ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తూ అందరికీ కింజారపు అచ్చెన్నాయుడు ఆదర్శంగా నిలిచారని అన్నారు. అక్రమ కేసులతో బలహీనవర్గాలకు చెందిన నేతలను వేధిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు త్వరలో బుద్ధి చెబుతారన్నారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే అచ్చెన్నాయుడుపై జగన్‌ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందన్నారు. 

జగన్‌రెడ్డి ప్రజాక్షేత్రంలో తెలుగుదేశం పార్టీ నేతలను ఎదుర్కోలేక పోలీసు వ్యవస్థను స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ అక్రమ కేసులు, దౌర్జన్యాలతో వేధిస్తున్నారన్నారని ఆరోపించారు. ప్రజా క్షేత్రంలో పోరాడే నేతలే చిరస్థాయిగా నిలిచిపోతారని అచ్చెన్నాయుడుతో చంద్రబాబు అన్నారు.
 

 

click me!