డిజిపి గారూ... మీ దృష్టిలో బాధితులే నిందితులా?: అచ్చెన్నాయుడు

Published : Jul 19, 2023, 02:06 PM IST
డిజిపి గారూ... మీ దృష్టిలో బాధితులే నిందితులా?: అచ్చెన్నాయుడు

సారాంశం

నరసరావుపేటలో వైసిపి శ్రేణులే టిడిపి నేత ఇంటిపై దాడిచేసారన్న విషయం అందరికీ తెలుసు... కానీ పోలీసులు మాత్రం బాధితులపైనే కేసులు నమోదు చేసారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. 

నరసరావుపేట :  పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి వర్గీయులు పరస్పరం దాడులకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. అయితే ఈ దాడుల వ్యవహారంలో కేవలం టిడిపికి చెందిన 19మంది నాయకులపైనే పోలీసులు కేసులు పెట్టారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

దాడి చేసిన వైసీపీ నాయకులు, చేయించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ను వదిలేసి బాధితులైన టిడిపి నాయకులపై హత్యాయత్నం కేసులు పెట్టడం దుర్మార్గమని అచ్చెన్నాయుడు అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేకు కాపాడేందుకు పోలీసులు ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరించడం తగదన్నారు. ఎవరిపై ఎవరు దాడిచేసారో నరసరావుపేట ప్రజలందరికీ తెలుసు... కానీ పోలీసులకు తెలియలేదా అంటూ మండిపడ్డారు. 

నరసరావుపేట గతంలో అభివృద్దికి మారుపేరుగా వుండేది... ఇప్పుడు అరాచకాలకు అడ్డాగా మారిందని అచ్చెన్నాయుడు అన్నారు. స్వయంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి పట్టపగలే ప్రతిపక్ష నాయకులపై దాడులు, విధ్వంసాలతో బీభత్సం సృష్టిస్తున్నారని... కానీ  ఇప్పటివరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. కానీ బాధితులైన చదలవాడ అరవింద్ బాబు, టిడిపి నాయకులపై అక్రమ కేసులు పెట్టడం వైసీపీ దిగజారుడు చర్యలకు నిదర్శనమని అన్నారు. 

Read More  ప్రభుత్వ వ్యతిరేకతను చీల్చడం జనసేన విధానం కాదు.. : పవన్ కళ్యాణ్

పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని... కేవలం టీడిపి నాయకులనే టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్ర డీజీపీ దృష్టిలో బాధితులే నిందితులా? అని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థను వైసీపీ నేతల జేబు సంస్థగా వాడుకుంటున్నారని అన్నారు. వైసిపి నాయకులు అరాచకాలు సృష్టిస్తున్నా పోలీసులకు కనిపించడం లేదు... కళ్లు మూసుకుని విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఓ రౌడీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు ఎందుకు వెనకాడుతున్నారని అచ్చెన్నాయుడు నిలదీసారు. 

వైసిపి పాలిత ఏపీలో శాంతిభద్రతలు ఎలా వున్నాయో నరసరావుపేట ఘటనను బట్టే అర్ధమవుతుందన్నారు అచ్చెన్నాయుడు. ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తూ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆధ్వర్యంలో వందల మంది రౌడీ మూకను తీసుకుని టీడీపీ నేతల ఇళ్లపై దాడులకు దిగడం వాస్తవం కాదా? ఎవరి ఇళ్లపై ఎవరు దాడి చేశారో, ఎవరిని ఎవరు హత్య చేయదలిచారో కూడా తెలియని దుస్థితిలో పోలీసులు ఉన్నారా? అంటూ ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులు ఏం చెబితే అది చేయడం తప్ప పోలీసులు చట్టాన్ని కనీసం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 

నాలుగేళ్లుగా దాడులు దౌర్జన్యాలతో రాష్ట్రాన్ని రక్తసిక్తం చేసిన అధికార పార్టీ నేతలకు పోలీసులు అండగా నిలుస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని అన్నారు. తక్షణమే నరసరావుపేట ఘటనలో అసలు నిందితులపై చర్యలు తీసుకోవాలని టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేసారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!