
సచివాలయం మొత్తం ఖాళీ. ఇపుడేమిటి హైదరాబాద్ లో ఏపి సచివాలయం ఎప్పుడో ఖాళీ అయిపోయింది కదా అనుకుంటున్నారా? ఇపుడు చెబుతున్నది వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం గురించి. ఈ జనవరి నెలలో సిఎం, మంత్రులు, ఉన్నతాధికారులు లేక వెలగపూడి కొద్ది రోజులు బోసిపోనున్నది.
కొత్త సంవత్సరం మొదలవ్వటమే, అంటే జనవరి 1వ తేదీ ఆదివారంతో మొదలైంది. 2వ తేది నుండి ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమాన్ని ఆరంభించింది. కాబట్టి సిఎం, మంత్రులు, ఉన్నతాధికారులందరూ వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నారు. చంద్రబాబుతో సహా ఎవరు కూడా మరో నాలుగు రోజుల పాటు సచివాలయంలో ఉండరు.
ఇదిలావుండగా, 7, 8 తేదీల్లో ముఖ్యమంత్రి శ్రీలంక పర్యటనలో ఉంటారు. వెంట కొంత మంది మంత్రులు, ఉన్నతాధికారులు వెళుతున్నారు. వారు తిరిగి వచ్చేటప్పటికి జన్మభూమి కార్యక్రమం పూర్తవుతుంది. వెంటనే సంక్రాంతి పండుగ హడావుడి మొదలవుతుంది. కాబట్టి అందరూ వారి వారి ఊర్లలోనే ఉంటారు.
ఇక సంక్రాంతి పండుగ 13, 14, 15 తేదీల్లో ఎలాగూ ప్రభుత్వానికి శెలవులే. కాబట్టి అప్పుడూ ఎవరూ అందుబాటులో ఉండరు. వెంటనే అంటే 16వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వట్జర్ ల్యాండ్ లోని దావోస్ పర్యటనకు బయలుదేరుతున్నారు.
అప్పుడు కూడా సిఎం వెంట కొందరు మంత్రులు, ఉన్నతాధికారులు వెళుతున్నారు. తిరిగి రావటం 22వ తేదీనే. ఈ మధ్యలో మరికొందరు ఉన్నతాధికారులు 9-14 తేదీల మధ్య దక్షిణ కొరియా, కువైట్ పర్యటనకు వెళుతున్నారు.
దావోస్ నుండి తిరిగి వచ్చిన తర్వాత సిఎం మళ్లీ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటిస్తారు. దాంతో అప్పుడు కూడా మంత్రులు, ఉన్నతాధికారులు సిఎంతో పాటు వెళ్లటమో లేక విడిగా జిల్లాల పర్యటనల్లోనో ఉంటారు.
సిఎం, మంత్రులు, ఉన్నతాధికారులు లేకుండా సచివాలయంలోని సబ్బంది మాత్రం ఉండి ఏం చేస్తారు? కాబట్టి వారు కూడా పెద్దగా వెళ్ళరు. కాబట్టే, వెలగపూడిలోని సచివాలయం జనవరి నెలంతా దాదాపుగా ఖాళీగానే ఉండబోతోంది.