పరిషత్ ఎన్నికలపై హైకోర్టు స్టే: హౌస్ మోషన్ పిటిషన్ వేయనున్న నీలం సాహ్ని

By telugu teamFirst Published Apr 6, 2021, 5:31 PM IST
Highlights

ఏపీ పరిషత్ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన స్టేను డివిజన్ బెంచీలో సవాల్ చేయాలని ఏపీ ఎస్ఈసీ భావిస్తోంది. ఇందుకు ఎపీ ఎస్ఈసీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పరిషత్ ఎన్నికలపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేయాలని ఏపీ ఎన్నికల కమిషనర్ (ఏపీఎస్ఈసీ) హైకోర్టులో ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది.

రాష్ట్రంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై స్టే విధిస్తూ ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జీ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికలకు నాలుగు వారాల కోడ్ ఉండాలనే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదనే కారణంతో ఏపీ హైకోర్టు ఎన్నికలపై స్టే ఇచ్చింది.

తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఏపీ హైకోర్టు ఎస్ఈసీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో హౌస్ మోషన్ పిటిషన్ వేయాలని ఎస్ఈసీ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని మంత్రి కొడాలి నాని ధ్రువీకరించారు. 

ఈ నెల 8వ తేదీన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉంది. ప్రస్తుత తరుణంలో పరిషత్ ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంది. అయితే, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ అవసరం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. 

చట్ట విరుద్ధమైన ఎన్నికలను బహిష్కరించడం సరైందని కోర్టు తీర్పు ద్వారా రుజువైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పటికైనా కొత్త నోటిపికేషన్ ఇవ్వాలని ఆయన అన్నారు.

గత ఎన్నికల ప్రక్రియనే ఎస్ఈసీ కొనసాగిస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. గత ఎస్ఈసీ వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు ఏమైనా కోర్టు తీర్పును అమలు చేయాల్సిందేనని అన్నారు.

click me!