అసెంబ్లీ తీర్మానంపై ట్విస్ట్: జగన్ సర్కారుకు షాచ్చిన ఈసీ నిమ్మగడ్డ రమేష్

By Siva KodatiFirst Published Dec 5, 2020, 3:58 PM IST
Highlights

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది.

జగన్ సర్కారుకు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు మధ్య ఈ వ్యవహారం తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిమ్మగడ్డ రమేష్ ప్రయత్నిస్తుండగా, జగన్ సర్కారు మాత్రం ఇప్పట్లో కుదరదని తేల్చి చెప్పింది.

ఈ పంచాయితీ రాష్ట్ర హైకోర్టులో కూడా నడుస్తోంది. ఈ తరుణంలోనే శుక్రవారం ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించేది లేదని రాష్ట్ర అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం తీర్మానం చేసింది. దీంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ అలర్ట్ అయ్యారు.

ఎన్నికల వ్యవహారమై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు నిమ్మగడ్డ రమేష్ లేఖ రాశారు. అసెంబ్లీ తీర్మానాన్ని తిరస్కరించాలని, అవసరమైతే సుప్రీం కోర్టు న్యాయ నిపుణులను సంప్రదించాలంటూ లేఖలో ప్రస్తావించారు.

స్థానిక ఎన్నికల నిర్వహణపై అసెంబ్లీ తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని లేఖలో నిమ్మగడ్డ రమేష్ పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 243 కే అధికరణ కింద ఎన్నికల కమిషన్‌కు స్వయం ప్రతిపత్తి ఉందని ఆయన అన్నారు.

ఐదేళ్లకోసారి ఎన్నికలు జరపడం కమిషన్ విధి అని స్పష్టం చేశారు. ఎన్నికల విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సమాన అధికారాలు ఉన్నాయని నిమ్మగడ్డ రమేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ సమ్మతితో ఎన్నికలు జరపాలన్న నిర్ణయం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమని అలాంటి ఆర్డినెన్స్ వస్తే తిరస్కరించాలని ఎస్ఈసీ కోరారు. 

click me!