ఏపీ మున్సిపల్ ఎన్నికలు: కౌంటింగ్‌కు సర్వం సిద్ధం, నిమ్మగడ్డ కీలక ఆదేశాలు

By Siva KodatiFirst Published Mar 13, 2021, 9:48 PM IST
Highlights

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేపిన ఏపీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎస్ఈసీ నిమ్మగడ్డ కీలక ఆదేశాలిచ్చారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ఆలస్యం కాకుండా చూడాలని అధికారులకు సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేపిన ఏపీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎస్ఈసీ నిమ్మగడ్డ కీలక ఆదేశాలిచ్చారు.

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ఆలస్యం కాకుండా చూడాలని అధికారులకు సూచించారు. రాత్రి 8 గంటల్లోగా అన్ని ఫలితాలనూ ప్రకటించేలా చూడాలని కోరారు. ఈ మేరకు కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి శనివారం అదనపు మార్గదర్శకాలు జారీ చేశారు.

కౌంటింగ్ కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూసుకోవాలని.. ప్రత్యామ్నాయంగా జనరేటర్లు, ఇన్వర్టర్లు సైతం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ కోరారు. కౌంటింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్, వీడియో లేదా సీసీ కెమెరాల ద్వారా చిత్రీకరించాలని తెలిపారు. అంతేకాకుండా కౌంటింగ్ ప్రక్రియ ఫుటేజీని ఎన్నికల రికార్డుగా భద్రపరచాల్సిందిగా ఆదేశించారు.  

నిర్దేశిత ప్రమాణాలు, నిబంధనలకు అనుగుణంగా కౌంటింగ్ జరిగేలా చూడాలని రిటర్నింగ్ అధికారులను నిమ్మగడ్డ ఆదేశించారు. పది కంటే తక్కువ మెజారిటీ సాధించిన సమయంలో మాత్రమే నిబంధనలు, మార్గదర్శకాల మేరకే రీకౌంటింగ్‌కు అనుమతించాలని ఆయన సూచించారు.

రెండంకెల మెజారిటీ వచ్చిన చోట్ల అభ్యర్థి విజ్ఞప్తి మేరకు జిల్లా కలెక్టర్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల ప్రకటన సమాచారం ప్రజల్లోకి వెళ్లేలా వివరాలు అందించేందుకు మీడియా కోసం ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను నిమ్మగడ్డ ఆదేశించారు.

కాగా, మొత్తం 11 కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీల్లో రేపు కౌంటింగ్ జరగనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఏలూరు, చిలకలూరిపేటలో కౌంటింగ్‌ ప్రక్రియకు బ్రేక్ పడింది. కౌంటింగ్‌కు సంబంధించి ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది.

కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట భద్రత, 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కోసం కార్పోరేషన్లలో 2204 టేబుళ్లు, మున్సిపాలిటీలలో 1822 టేబుళ్లు మొత్తం 4026 టేబుళ్లు ఏర్పాటు చేశారు.

కార్పోరేషన్‌లలో కౌంటింగ్ సూపర్ వైజర్లు- 2376 మంది, కౌంటింగ్ సిబ్బంది -7412 మంది, మున్సిపాలిటీలలో కౌంటింగ్ సూపర్ వైజర్లు-1941, కౌంటింగ్ స్టాఫ్ సిబ్బంది 5195 మందిని ఎన్నికల సంఘం నియమించింది.

click me!