AP Rains: సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలు.. ఉప్పొంగుతున్న చిత్రావతి..

Published : Aug 02, 2022, 06:22 AM IST
AP Rains: సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలు.. ఉప్పొంగుతున్న చిత్రావతి..

సారాంశం

Heavy rains: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌లు చోట్ల భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపుల‌తో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల పిడుగులు ప‌డ‌టం జ‌రిగింది.   

Andhra Pradesh rains: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని సత్యసాయి, అనంతపురం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఆదివారం నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో చిక్కబళ్లాపూర్ జిల్లాలోని పెన్నార్ బేసిన్‌లో చిత్రావతి నది ఉప్పొంగింది. ఏపీ సరిహద్దుకు సమీపంలో ఉన్న కర్ణాటకలోని గౌరీబిదనూరు తాలూకాలోని పరగోడు జలాశయం పొంగిపొర్లుతోంది. ఉరుములు మెరుపుల‌తో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.  ప‌లు చోట్ల పిడుగులు ప‌డ్డాయి. అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం ఉంతకల్ గ్రామ శివారులోని జిలెటిన్ స్టిక్స్ గోడౌన్‌లో సోమవారం పేలుడు సంభవించింది. వర్షాల సమయంలో పిడుగుపాటు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

కనీసం 5,000 జిలెటిన్ స్టిక్స్ అగ్నికి ఆహుతయ్యాయి. సమీపంలోని ఉంతకల్ గ్రామంలోని ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. భద్రత దృష్ట్యా గ్రామానికి దూరంగా పొలాల్లో గోడౌన్‌ ఉంది. గోడౌన్‌లో కూలీలు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. జిలైన్ స్టిక్స్‌ను నల్గొండ జిల్లాలోని లైసెన్స్‌డ్ యూనిట్ నుంచి కొనుగోలు చేసినట్లు అధికారులు ప్రాథమిక విచారణ తర్వాత తెలిపారు. చిత్రావతి వరదల కారణంగా పుట్టపర్తి వైపు కాజ్‌వేలు, రోడ్లు నీటమునిగడంతో పరగోడు నీటిని చిలమత్తూరు మండలం వైపు నదిలోకి విడుదల చేశారు. వరదల నేపథ్యంలో చిత్రావతి నదీతీర వాసులకు ఏపీ, కర్ణాటక రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పట్టణ ప్రాంతాలు, గ్రామాలకు సమీపంలో చిత్రావతి నది ప్రవహించే గోరంటాల, పుట్టపర్తి వద్ద పరిస్థితిని అధికారుల బృందాలు పర్యవేక్షించాయి. గతేడాది పుట్టపర్తిలో చిత్రావతి నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహించింది. మడకశిరలోని ప్రభుత్వాసుపత్రి ముంపునకు గురవ్వడంతో పాటు సమీప కొండ ప్రాంతాల నుంచి వరదనీరు ప్రవహించడంతో ఆస్పత్రి వార్డుల్లోకి వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో దుకాణాలు, ఇళ్లలోకి నీరు చేరింది.

హిందూపురం మున్సిపాలిటీలో సాగునీటి కాల్వలు పొంగిపొర్లడంతో ఆదివారం ఆలస్యంగా నివాస ప్రాంతాల్లోకి నీరు చేరడంతో పలు కాలనీలు నీట మునిగాయి. అమరాపురం మండలంలో ఒక్కరోజులో 164.2మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెనుకొండ పట్టణంలో 98.4మి.మీ, మడకశిరలో 88.2మి.మీ, హిందూపురం పట్టణంలో 74.8మి.మీ వర్షపాతం నమోదైంది. ఎగువన ఉన్న కర్ణాటక ప్రాంతాల నుండి నీటి ప్రవాహంతో పాటు, స్థానికంగా కూడా భారీ వర్షాల ఫలితంగా అనేక నివాస ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. హిందూపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ బలరామి రెడ్డి, పౌర అధికారులతో కలిసి మోడల్ కాలనీ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టారు. అక్కడ కాలనీ మొత్తం వర్షపు నీటితో నిండిపోయింది.  రోడ్లు 4 అడుగుల కంటే ఎక్కువ నీటిలో  మునిగాయి. సత్యసాయి జిల్లాలో సగటు వర్షపాతం 37మి.మీ కాగా ఆదివారం 1183మి.మీ భారీ వర్షపాతం నమోదైంది. సోమవారం కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కనీసం ఎనిమిది మండలాల్లో 50మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కాగా, 12 మండలాల్లో 20-50మి.మీ, 10 మండలాల్లో 20మి.మీ కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. శనివారం 266.2మి.మీ వర్షపాతం నమోదైంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!