
అమరావతి: జగన్ సర్కార్ ప్రకటించిన పీఆర్సీ (PRC)ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులంతా ఉద్యమబాట పట్టారు. ఈ క్రమంలోనే నిన్న(గురువారం) ఛలో విజయవాడ (Chalo Vijayawada)ను విజయవంతం చేసుకున్న ఉద్యోగులు తమ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసారు. తమ సమస్యలను పట్టించుకోని ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేస్తూ సచివాలయ ఉద్యోగులు పెన్ డౌన్ (pen down) చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను పరష్కరించే వరకు విధులకు దూరంగా వుంటామని సచివాలయ ఉద్యోగులు స్పష్టం చేసారు.
ఇప్పటికే పీఆర్సీ నిరసలను ఉదృతం చేస్తూ ఈ నెల 7వ తేదీ(సోమవారం) నుండి సమ్మెకు దిగనున్నట్లు ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సెక్రటేరియట్ ఉద్యోగులు ఓరోజు ముందుగానే తమ సమ్మెను ప్రారంభించారు. రేపు, ఎల్లుండి(శని,ఆదివారం) సెలవురోజుల కావడంతో ఇవాళ్టినుండి విధులకు దూరంగా వుండాలని సచివాలయ ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే పెన్ డౌన్ ,యాప్ డౌన్ చేపట్టారు.
ఇదిలావుంటే నిన్న(గురువారం) ఉద్యోగులు చేపట్టిన ఛలో విజయవాడ విజయవంతం కావడంతో పీఆర్సీ సాధన సమితి కూడా స్పీడ్ పెంచింది. ఓవైపు ప్రభుత్వంతో చర్చలగురించి సమాలోచనలు చేస్తూనే మరోవైపు సమ్మెను సక్సెస్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఛలో విజయవాడ మాదిరిగానే ఉద్యోగులందరినీ ఒకేతాటిపైకి తెచ్చి సమ్మెలో పాల్గొనేలా చేయడంద్వారా ప్రభుత్వాన్ని స్తంభింపజేయాలని ఉద్యోగసంఘాలు భావిస్తున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు ఆర్టిసి ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొననున్నారు. దీంతో స్కూల్లు మూతపడటంతో పాటు ఆర్టీసి బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. అయితే ఉద్యోగులు సమ్మెకు దిగితే బస్సులను నడిపే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీఎస్ ఆర్టీసి ఛైర్మన్ వెల్లడించారు.
ఉద్యోగులు సమ్మెకు దిగకుండా బుజ్జగించే ప్రయత్నాలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఉద్యోగుల పీఆర్సీతో ఆర్టీసి ఉద్యోగుల పీఆర్సీకి అసలు సంబంధమే లేదని ఆర్టీసి ఛైర్మన్ మల్లికార్జున్ రెడ్డి పేర్కొన్నారు. కాబట్టి ఆర్టీసి ఉద్యోగులు సమ్మెకు దిగడంలో లాభం లేదని... ఏవయినా సమస్యలుంటూ సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించుకుందామంటూ ఛైర్మన్ బుజ్జగించే ప్రయత్నం చేసారు. ఇక ఉపాధ్యాయులను విద్యాశాఖ మంత్రి సురేష్, ఉద్యోగులను సీఎం సముదాయించడానికి ప్రయత్నిస్తున్నారు.
ఉద్యోగులు, ప్రభుత్వం వేర్వేరు కాదని.. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమన్నారు సీఎస్ సమీర్ శర్మ. ఉద్యోగులకెవరికీ జీతాలు తగ్గించవద్దని సీఎం జగన్ చెప్పారన్నారు. పీఆర్సీ విషయమై ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల బృందం చర్చిస్తోందని... ఉద్యమ కార్యాచరణను ఉద్యోగులు వాయిదా వేసుకోవాలని సమీర్ శర్మ హితవు పలికారు.
సమస్యలకు సమ్మె పరిష్కారం కాదని... ఉద్యోగులతో ఓపెన్ మైండ్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని సీఎస్ స్పష్టం చేశారు. అభ్యంతరాలను చర్చలతో పరిష్కరించుకునే అవకాశముంది... కాబట్టి సమ్మె కార్యాచరణ విరమించుకోవాలని సమీర్ శర్మ ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. సమ్మెకు వెళ్లడమంటే కష్టాలు కొని తెచ్చుకోవడమేనని... ఉద్యోగుల సమ్మెను అసాంఘిక శక్తులు కైవసం చేసుకునే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు . పీఆర్సీ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశాలు లేవని సీఎస్ స్పష్టం చేశారు.
ఉద్యోగులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని... వాస్తవానికి ప్రతి ఏటా 15 శాతం ఆదాయం పెరగాలని సమీర్ శర్మ అన్నారు. పీఆర్సీకి అదనంగా గ్రాట్యుటీ, హౌసింగ్ స్కీమ్ వలన అదనపు ప్రయోజనం ఉందని.. ప్రతి పీఆర్సీ అప్పుడు చర్చల కమిటీ ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగులు ఏ సమస్య ఉన్నా చర్చించుకుందాం. సమ్మె ఆలోచనను విరమించుకోండి. మనమంతా ఒక కుటుంబం. హెచ్‌ఆర్‌ఏ లాంటివి మాట్లాడుకుందాం రండి. ఉద్యోగులను చర్చలకు రమ్మని కోరుతున్నాను' అని సీఎస్ సమీర్ అన్నారు.