ప్రభుత్వంలో విలీనంతో నష్టపోయాం... న్యాయం చేయండి..: జగన్ కు ఆర్టీసీ ఉద్యోగుల లేఖ

Arun Kumar P   | Asianet News
Published : Feb 02, 2022, 01:39 PM ISTUpdated : Feb 02, 2022, 01:49 PM IST
ప్రభుత్వంలో విలీనంతో నష్టపోయాం... న్యాయం చేయండి..: జగన్ కు ఆర్టీసీ ఉద్యోగుల లేఖ

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు తమ సమస్యలను వివరిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాసారు. ప్రభుత్వ నిర్ణయంతో నష్టపోయామని... తమను ఆదుకోవాలని ఆర్టిసి ఎంప్లాయిస్ యూనియన్స్ కోరాయి. 

అమరావతి: ఓవైపు పీఆర్సీ (PRC) విషయంలో జగన్ ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వివాదం కొనసాగుతున్న తరుణంలోనే ఆర్టీసి (APSRTC) ఉద్యోగులు కూడా తమ సమస్యల పరిష్కారానికి సిద్దమయ్యారు. ఈ మేరకు తమ సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వంలో ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థను విలీనం చేయడం ద్వారా తాము నష్టపోయామని... కాబట్టి మీరే న్యాయం చేయాలంటూ సీఎం జగన్ (ys jagan) కు ఆర్టిసి ఉద్యోగులు లేఖ రాసారు. 

''ప్రభుత్వంలో విలీనంతో 2021లో ఒక పీఆర్సీ కోల్పోయాం. కాబట్టి విలీనం వల్ల కోల్పోయిన పీఆర్సీ నష్టాన్ని భర్తీచేయాలి. మాకు అదనపు ఫిట్‌మెంట్‌ బెనిఫిట్ ఇచ్చి స్కేల్స్ నిర్ణయించాలి'' అని ఆర్టీసి ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు కోరారు. 

''2017 పీఆర్సీకి 2019లో 25శాతం తాత్కాలిక ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. ప్రభుత్వోద్యోగులతో పాటే మాకూ ఫిట్‌మెంట్‌ ఇస్తామన్నారు. ప్రభుత్వంలో విలీనం వల్ల 2021 పీఆర్సీ పెండింగ్‌లో పడింది. తాజా పీఆర్సీలో 2021 పీఆర్సీని నష్టపోతున్నాం'' అని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. 

''ఆర్టీసీ విలీనం తర్వాత ఉద్యోగుల సౌకర్యాలు తొలగిస్తున్నారు. ఇప్పటికే ఎస్‌ఆర్‌బీఎస్‌, ఎస్‌బీటీ, గ్రాట్యుటీ సౌకర్యం తొలగించారు. వైద్య సౌకర్యాలు, నెలసరి ఇన్సెంటివ్‌లు కూడా నిలిపేశారు'' అంటూ ఆర్టీసి ఉద్యోగులు తమ ఆందోళనను లేఖ ద్వారా సీఎం జగన్ కు తెలిపారు. 

ఇదిలావుంటే పీఆర్సీ విషయంలో అటు ప్రభుత్వమూ ఇటు ఉద్యోగులు వెనక్కితగ్గడం లేదు. ఇప్పటికే ప్రకటించినట్లుగానే పీఆర్సీపై ప్రభుత్వం ముందుకు వెళుతుంటే ఉద్యోగులు నిరసనలను మరింత ఉదృతం చేయడానికి సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే రేపు(గురువారం) ఉద్యోగులు ఛలో విజయవాడకు పిలుపునిస్తే ఇందుకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు అడ్డుకునేందుకు సిద్దమయ్యారు. 

ఈ నెల 3న తలపెట్టిన ఛలో విజయవాడకు అనుమతి నిరాకరిస్తున్నట్లు విజయవాడ పోలీస్ కమీషనర్ క్రాంతిరాణా తెలిపారు. కరోనా నిబంధనల కారణంగా ఛలో విజయవాడకు అనుమతి ఇవ్వడం లేదని సీపీ పేర్కొన్నారు. ఛలో విజయవాడ కార్యక్రమం చట్టవిరుద్ధమని క్రాంతి రాణా అన్నారు. ఉద్యోగుల కాండాక్ట్ రూల్స్ ప్రకారం కూడా.. ఛలో విజయవాడ కార్యక్రమం చేయకూడదని సీపీ వ్యాఖ్యానించారు. 

కాగా ప్రభుత్వ సంప్రదింపుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులు మంగళవారం నాడు సచివాలయంలో భేటీ అయ్యారు. ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానిస్తూ మంత్రుల కమిటీ సోమవారం నాడు రాత్రి లేఖలు పంపింది. పీఆర్సీ సాధన సమితిలో కీలకంగా ఉన్న నేతలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఈ లేఖలను అందించింది. 

రాష్ట్ర ప్రభుత్వం నుండి లిఖితపూర్వక హామీ వస్తేనే చర్చలకు హాజరవుతామని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు. దీంతో  ప్రభుత్వం నిన్న లిఖితపూర్వకంగా ఉద్యోగులను చర్చలకు ఆహ్వానం పంపింది.అయితే గతంలో తాము ప్రభుత్వం ముందుంచిన పీఆర్సీ జీవోలను అభయన్స్ లో పెట్టాలని, పాత జీతాలను ఇవ్వాలని, ఆశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను బయట పెట్టాలని కూడా పీఆర్సీ సాధన సమితి డిమాండ్ చేసింది.ఈ డిమాండ్లకు తలొగ్గి రాత పూర్వకంగా చర్చలకు ఆహ్వానిస్తే తాము చర్చలకు వెళ్తామని సోమవారం నాడు పీఆర్సీ సాధన సమితి నేతలు ప్రకటించారు.

అయితే మంత్రుల కమిటీ నుండి వచ్చిన ఆహ్వానంపై పీఆర్సీ సాధన సమితి నేతలు సమావేశమై చర్చించారు. మంత్రుల కమిటీ నుంచి లిఖిత పూర్వకంగా ఆహ్వానం వచ్చినందున చర్చలకు వెళ్లాలని స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. మంత్రుల కమిటీ ముందుకు వెళ్లి ఇప్పటికే ఇచ్చిన డిమాండ్లను మరోసారి ఉంచాలని స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది.  
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu