AP PRC Issue: చర్చలకు రావాలని ఆహ్వానించిన మంత్రులు కమిటీ.. పీఆర్సీపై తగ్గేదే లే అంటున్న ఉద్యోగ సంఘాలు

By Sumanth KanukulaFirst Published Jan 24, 2022, 9:41 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తమ సమస్యలను పరిష్కరించకుంటే ఫిబ్రవరి 7వ తేదీన నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ.. ఉద్యోగ సంఘాల నాయకులతో సంప్రదింపులకు ఆహ్వానం పంపింది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన PRC జీవోలపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తమ సమస్యలను పరిష్కరించకుంటే ఫిబ్రవరి 7వ తేదీన నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కలిసి సమ్మె నోటీస్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. మరోవైపు ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులతో కోసం.. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, పేర్నినాని (Perni Nani), ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మలతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ.. చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానం పంపింది. నేడు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయం రెండో బ్లాక్‌కు రావాలంటూ ఉద్యోగ సంఘాల నాయకులకు సమాచారం ఇచ్చింది. 

ప్రభుత్వంతో చర్చలకు రావాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ ఉద్యోగ సంఘాలను ఆహ్వానించారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎస్‌ సమీర్‌శర్మ ఢిల్లీపర్యటనలో ఉన్నందున కమిటీలోని మిగిలిన ముగ్గురూ ఉద్యోగులతో సంప్రదింపులకు అందుబాటులో ఉంటామని సమాచారం ఇచ్చారు. అయితే ఈ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయి. 

పీఆర్సీ ఉత్తర్వులు రద్దు చేస్తేనే ప్రభుత్వంతో చర్చల విషయం ఆలోచిస్తామని పీఆర్సీ స్టీరింగ్ కమిటీ తేల్చిచెప్పింది. విజయవాడలోని రెవెన్యూ కార్యాలయంలో పీఆర్సీ స్టీరింగ్ కమిటీ దాదాపు 5 గంటల పాటు సమావేశమై చర్చలు జరిపింది. ఇక, ఈ సమావేశం జరుగుతుండగానే ఉద్యోగ సంఘాల నాయకులకు మంత్రులు..బొత్స, పేర్ని నాని పోన్‌ చేసినట్లు సమాచారం. జీవోలపై వెనక్కు తగ్గే వరకూ చర్చల ప్రసక్తే లేదని ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. 

మరోవైపు ఉద్యోగులకు వ్యతిరేకంగా ప్రభుత్వం, వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని పీఆర్సీ స్టీరింగ్ కమి ఖండించింది. జవనరి నెలకు పాత జీతాలే ఇవ్వాలని, కొత్త జీతాలు ఇచ్చేందుకు ట్రెజరీ ఉద్యోగులపై ఒత్తిడి తేవొద్దని సూచించింది. సమావేశం అనంతరం ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు (bopparaju venkateswarlu) మాట్లాడుతూ.. ఉద్యమంలోకి ఎలాంటి రాజకీయపార్టీలను అనుమతించేది లేదన్నారు. ప్రభుత్వం తాము యుద్ధం ప్రకటించినట్లు ఫీల్ అవుతుందని మండిపడ్డారు. జీవోలు ఇచ్చే ముందు కనీసం చర్చలు జరపలేదని.. ఉద్యోగుల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోందని బొప్పరాజు ఫైరయ్యారు. ప్రభుత్వం వారి రాజకీయ పార్టీ తరపున మాటల యుద్ధం చేయడం ఆవేదన కలిగిస్తోందన్నారు.

వెంకట్రామి రెడ్డి (venkatrami reddy) మాట్లాడుతూ.. జీవోలు వెనక్కి తీసుకుని అశుతోష్ మిశ్రా నివేదిక బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మెరుగైన పీఆర్సీ ఇచ్చేందుకు మళ్లీ చర్చలు జరపాలని.. కాంట్రాక్ట్, NMR ఉద్యోగుల సమస్యలు కూడా ప్రభుత్వం ముందు పెడతామని వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఉద్యోగులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. మిగిలిన ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఇదే రకమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

click me!