ప్రజలు చితక్కొడుతుంటే నిన్ను కాపాడింది పోలీసులే : అచ్చెన్నాయుడుకి పోలీసులు వార్నింగ్

By Nagaraju penumalaFirst Published Sep 11, 2019, 8:48 PM IST
Highlights

గత ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడినప్పుడు ప్రజలు అచ్చెన్నాయుడిని చితక్కొడుతుంటూ కాపాడింది పోలీసులే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. పోలీసుల పట్ల మరొకసారి అమర్యాదగా ప్రవర్తిస్తే సరైన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.

నెల్లూరు: తెలుగుదేశం పార్టీ కీలక నేత, ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఏపీ పోలీసు అధికారుల సంఘం. ఎస్పీ విక్రాంత్ పాటిల్ పై అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు సరికాదంటూ మండిపడింది.

గతంలో మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడుకు 144 సెక్షన్ గురించి తెలియకపోవడం సిగ్గు చేటు అంటూ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు అన్నారు. గత ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడినప్పుడు ప్రజలు అచ్చెన్నాయుడిని చితక్కొడుతుంటూ కాపాడింది పోలీసులే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. 

పోలీసుల పట్ల మరొకసారి అమర్యాదగా ప్రవర్తిస్తే సరైన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. సీఐగా పని చేసిన ఓ వ్యక్తి ఎంపీగా ప్రజలకు సేవలు అందిస్తున్నారని అచ్చెన్నాయుడు మీరు సీఐ కాగలరా అంటూ నిలదీశారు. మీకా అర్హత ఉందా అని శ్రీనివాసరావు ప్రశ్నించారు. 

మాజీమంత్రి అచ్చెన్నాయుడిపై డీజీపీకి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇకపోతే చలో ఆత్మకూరు పిలుపులో భాగంగా అచ్చెన్నాయుడు చంద్రబాబు నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. 

అయితే ఎస్పీ విక్రాంత్ పాటిల్ అచ్చెన్నాయుడు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దాంతో రెచ్చిపోయిన అచ్చెన్నాయుడు ఏయ్ ఎగస్ట్రాలు చేయోద్దు, నన్ను ఆపే హక్కు నీకు ఎవడిచ్చాడు అంటూ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ను దుర్భాషలాడారని పోలీసులు ఆరోపిస్తున్నారు.

 

click me!