YS Sharmila: అరెస్టు చేస్తుండగా గాయపడ్డ వైఎస్ షర్మిల.. తన తండ్రి, తల్లిని పేర్కొంటూ కామెంట్స్

By Mahesh K  |  First Published Feb 22, 2024, 3:38 PM IST

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. ఛలో సెక్రెటేరియట్ నినాదంతో ర్యాలీ తీస్తుండగా ఆమెను, పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
 


YS Sharmila: డీఎస్సీ అభ్యర్థులకు సంఘీభావంగా ఛలో సెక్రెటేరియట్ కార్యక్రమం చేపట్టిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ముందునుంచే పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారు. కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్టులు కూడా చేశారు. ఇది గమనించే వైఎస్ షర్మిల నిన్న రాత్రి ఇంటికి వెళ్లలేదు. కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్నం భవన్‌లోనే పడుకున్నారు. ఈ రోజు ఆమె కచ్చితంగా సచివాలయాన్ని చేరుకోవాలని ప్రతిన బూనారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. ఆమె వినలేదు. దీంతో బలవంతంగా ఆమెను బస్సులోకి ఎక్కించుకుని మంగళగిరి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.

కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి సెక్రెటేరియట్‌కు ర్యాలీగా వెళ్లేందుకు వారు ప్రయత్నించారు. కానీ, పోలీసులు వారిని నిలువరించి అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా సీతానగరం కొండవీటి వాగు ఎత్తిపోతల వద్ద పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఇతర పార్టీ కార్యకర్తలను కూడా బస్సులో ఎక్కించారు. ఆమెను కూడా ఒక సాధారణ కార్యకర్తలాగే బస్సులో ఎక్కించారు. జగన్ ప్రభుత్వంలో ఆమె అరెస్టు కావడం ఇదే తొలిసారి. బస్సులో ఎక్కించిన తర్వాత డోరులోనే ఆమె ఓ సారి పట్టుతప్పి పడిపోయారు. మళ్లీ పైకి లేసి జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.

Latest Videos

అరెస్టు చేసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ఒక ఆడబిడ్డ అని కూడా చూడకుండా దౌర్జన్యానికి తెగబడ్డారని, తాను గాయపడ్డానని షర్మిల అన్నారు. పోలీసులు అరెస్టు చేస్తుండగా తన చేతికి గాయమైందని వివరించారు. ఇవాళ నిరుద్యోగుల పక్షాన రిప్రెజెంటేషన్ ఇద్దామని సెక్రెటేరియట్‌కు బయల్దేరామని, కానీ, అక్కడ సీఎం, మంత్రులు లేరని, కనీసం సీఎస్‌లు, అధికారులు కూడా లేరని పేర్కొన్నారు. నిరుద్యోగుల కోసం రిప్రజెంటేషన్ ఇద్దామనుకుంటే పోలీసులు అడ్డుకున్నారని అన్నారు. ఇది చూసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ క్షోభిస్తుందని, అమ్మ బాధపడుతుందని తెలిపారు.

Also Read: Holiday: ఈ జిల్లాలో రేపు స్కూళ్లకు సెలవు.. మరో జిల్లాలో నాలుగు రోజులు సెలవు

అరెస్టుకు ముందు ఆమె మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 23 వేల డీఎస్సీ ఉద్యోగాలతో మెగా డీఎస్సీ వేస్తానని జగన్ అధికారంలోకి వచ్చాడని ఆమె అన్నారు. కానీ, తీరా 6 వేల ఉద్యోగాలతో దగా డీఎస్సీ వేశాడని ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఈయన కంటే నయం అని, ఆయన కనీసం 7 వేల ఉద్యోగాలతో డీఎస్సీ వేశాడని పేర్కొన్నారు. 

నిరుద్యోగుల పక్షాన తాము గళం ఎత్తితే, ఆందోళన బాట పట్టితే ఎందుకు అంతా వణుకు అని వైఎస్ షర్మిల జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం తాలిబాన్లలా వ్యవహరిస్తున్నదని తీవ్ర ఆరోపణలు చేశారు. 

click me!