
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యస్థీకరణ అంశం తుదిదశకు చేరినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌పై ప్రజల నుంచి అభ్యంతరాలు కూడా స్వీకరించారు. వీటి ఆధారంగా తుది నోటిఫికేషన్ కొన్ని చిన్న చిన్న మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉగాది (ఏప్రిల్ 2) నుంచి కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభించాలని సీఎం జగన్ భావిస్తున్న నేపథ్యంలో.. అందుకు అనుగుణంగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ తుదిదశకు చేరింది.
ఈ నెలాఖరున కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అయితే తుది నోటిఫికేషన్ వెలువడేనాటికి రెవెన్యూ డివిజన్లు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లోనివి కాకుండా.. అదనంగా మరో 5 రెవెన్యూ డివిజన్లు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. కొన్ని మండలాల.. జిల్లాల మార్పులను ప్రభత్వుం పరిశీలిస్తున్నట్టుగా సమాచారం.
కొత్త జిల్లాల పునర్వ్యస్థీకరణకు సంబంధించి ఏపీ ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజల కోరిక మేరకు ముందుకు వెళ్లాలని సీఎం జగన్ చెప్పినట్టుగానే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. దాదాపు 10వేల వరకు అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. అంశాలవారీగా 70 వరకు కీలక అభ్యంతరాలు వచ్చాయి. జిల్లాల పునర్విభజన కసరత్తు దాదాపుగా పూర్తి కావచ్చిందని తెలిపారు. ఈ నెలాఖరుకు తుది నోటిఫికేషన్ వెలువడుతుందన్నారు. కొత్త జిల్లాలకు శాఖల వారీగా పోస్టుల కేటాయింపు, ఆర్డర్ల జారీ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలను సీఎం నిశితంగా పరిశీలించినట్టుగా చెప్పారు.
ఇప్పటికే జిల్లాల పేరు, రెవెన్యూ డివిజన్లను మార్చాలని కోరుతూ ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలపై సీఎం జగన్ ఇప్పటికే ఉన్నతాధికారులతో పలుమార్లు సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. వీటిలో కొన్నింటిపై సానుకూల నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక, ఉగాది రోజున కొత్త జిల్లాలను సీఎం జగన్ ప్రారంభించనున్నారని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. ఈ క్రమంలోనే మార్చి 31న లేదా ఏప్రిల్ 1వ తేదీన కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఆర్థిక శాఖ కూడా ఉద్యోగుల విభజన అంశాన్ని పూర్తి చేస్తోంది. పోలీస్ శాఖలోనూ విభజనకు కసరత్తులు జరుగుతున్నాయి.