
రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థలకు ఈ సవరణలు వర్తించనున్నాయి. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కూడా కొత్త షెడ్యూల్ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను నాలుగు రోజుల పాటు వాయిదా వేస్తూ కొత్త తేదీలను ఖరారు చేసింది.
కొన్ని పట్టణ ప్రాంతాల్లో నామినేషన్లు దాఖలు చేయకుండా అభ్యర్థులను అడ్డుకున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఎస్ఈసీ ఈ అంశంపై విచారణ చేపట్టింది. కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసుల నివేదికలతో పాటు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సమర్పించిన ఫిర్యాదులు, ఎలక్ట్రానిక్ ఆధారాలను పరిశీలించింది. ఈ క్రమంలో అభ్యర్థులను బెదిరించడం, దాడులకు పాల్పడటం, నామినేషన్ పత్రాలను చించివేయడం వంటి ఘటనలు జరిగినట్లు గుర్తించింది.
దీంతో నామినేషన్లు వేయలేకపోయిన అభ్యర్థులకు అదనపు అవకాశం కల్పించింది. కడప, రాజంపేట, మైదుకూరు, తిరుపతి పట్టణ స్థానిక సంస్థల్లో నామినేషన్ల స్వీకరణ గడువును మరో 48 గంటలు పొడిగించింది. అక్టోబర్ 23, 24 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఇప్పటికే ప్రకటించిన కేంద్రాలతో పాటు సంబంధిత కలెక్టరేట్లలోనూ నామినేషన్లు సమర్పించవచ్చు.
ఈ అవకాశం కింద కడప మున్సిపల్ కార్పొరేషన్లో 11 వార్డులు, రాజంపేట మున్సిపాలిటీలో 11 వార్డులు, మైదుకూరు మున్సిపాలిటీలోని మొత్తం 32 వార్డులు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో 18 వార్డులకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు.
నాలుగు పట్టణ స్థానిక సంస్థల్లో అదనంగా దాఖలైన నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 25న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. కొత్తగా నామినేషన్లు సమర్పించిన అభ్యర్థులకు మాత్రమే అదే రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అక్టోబర్ 25న మధ్యాహ్నం 3 గంటల అనంతరం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.
సవరించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 1న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అవసరమైన ప్రాంతాల్లో నవంబర్ 2న రీపోలింగ్ చేపడతారు. నవంబర్ 3న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను వెల్లడిస్తారు. మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ప్రకటించనుంది.