స్థానిక ఎన్నికల నేప‌థ్యంలో చంద్ర‌బాబు కీల‌క ఆదేశాలు.. పార్టీ ఆదేశాలు ధిక్క‌రిస్తే

Published : Oct 20, 2026, 07:30 PM IST
Andhra Pradesh

సారాంశం

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సూచించారు. పార్టీ నిర్ణయాలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

రెబల్స్‌ నామినేషన్ల ఉపసంహరణపై స్పష్టమైన ఆదేశాలు

స్థానిక ఎన్నికల్లో పార్టీ తరఫున అధికారికంగా ఎంపిక చేసిన అభ్యర్థుల విజయానికి అందరూ కలిసి పనిచేయాలని చంద్రబాబు సూచించారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇత‌ర‌ అభ్యర్థులను బరిలోకి దించడం వల్ల కూటమి ఓట్లకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రెబల్స్‌తో మాట్లాడి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చూడాలని నేతలకు బాధ్యతలు అప్పగించారు. అధికారిక అభ్యర్థులకు అవసరమైన బీఫాంలను వెంటనే అందజేసి, ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

కూటమి పార్టీల మధ్య సమన్వయానికి ప్రాధాన్యం

స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు కూటమి పార్టీల మధ్య సమన్వయం ఉండాలని సీఎం స్పష్టం చేశారు. పొత్తుల్లో భాగంగా ఏ పార్టీకి ఏ స్థానం కేటాయించారో ఆ నిర్ణయానికి అనుగుణంగా నేతలు వ్యవహరించాలని సూచించారు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం అదనపు అభ్యర్థులను నిలబెట్టడం, పార్టీ నిర్ణయాలను పక్కనపెట్టడం సరికాదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సమష్టిగా పనిచేస్తూ క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశం చేయాలని కోరారు.

ఇంటింటి ప్రచారంతో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని చంద్రబాబు నేతలకు సూచించారు. కేవలం బహిరంగ సభలకే పరిమితం కాకుండా ఇంటింటి ప్రచారానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. బూత్‌ స్థాయిలో పార్టీ కార్యకర్తలు చురుగ్గా పనిచేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు కలిగిన ప్రయోజనాలను వివరించి, స్థానికంగా ప్రజల మద్దతు కూడగట్టాలని దిశానిర్దేశం చేశారు.

క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు..

పార్టీ ఆదేశాలను ధిక్కరించి రెబల్స్‌గా పోటీలో నిలిచేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. ఎన్నికల్లో గెలుపు కోసం రౌడీయిజం, అధికార దుర్వినియోగం వంటి పద్ధతులను ఆశ్రయించకూడదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో విలువలు, పార్టీ క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నేతలు తమ మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన ఫలితాల కంటే స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించే దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

పార్టీ కోసం పనిచేసిన వారికి పదవుల్లో అవకాశం

ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలు, నేతలకు స్థానిక ఎన్నికలు మంచి అవకాశమని చంద్రబాబు పేర్కొన్నారు. కూటమి పొత్తులు, సామాజిక సమీకరణాల కారణంగా కొందరికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కకపోవచ్చని తెలిపారు. అలాంటి వారికి నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. మరోవైపు, 11 కార్పొరేషన్లను 11 సామాజికవర్గాలకు కేటాయించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అన్ని వర్గాలకు పాలనలో భాగస్వామ్యం కల్పించడమే తమ ఉద్దేశమని వివరించారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన వారికి తగిన గుర్తింపు లభించేలా చూస్తామని తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Andhra pradesh: 11వ నెల 11వ తేదీ 11 గంటల 11 నిమిషాలకు.. ఏపీలో కొత్త పార్టీ ఆవిర్భావం
బంగాళాఖాతంలో బలపడిన ద్రోణి.. పండగపూట కూడా వదలని వరుణుడు | Asianet News Telugu