మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని జనసేన ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో చేతులు కలపనందుకే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరింత దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. శనివారంనాడు జనసేన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలను బట్టి జనసేన వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాలున్నట్లు అర్థమవుతోంది.
వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని సీట్లైనా గెలుచుకోవాలనే నిర్ణయానికి విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ వచ్చినట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను కూడా సమావేశంలో చర్చించారు. టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్లనే వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చాయని సమావేశం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో వైసిపికి గుణపాఠం చెప్పడానికే కాకుండా కొన్ని స్థానాలనైనా గెలుచుకోవడానికి టీడీపీతో పొత్తు అవసరమని సమావేశం అభిప్రాయపడింది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది.
కాగా, రాజధాని తరలింపుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నుంచి ప్రకటన వచ్చిన తర్వాతనే కార్యాచరణ రూపొందించుకుందామని పవన్ కల్యాణ్ సమావేశంలో చెప్పినట్లు తెలుస్తోంది. దానికి ముందు కార్యాచరణ ప్రకటించడం వల్ల లాభం ఉండదని ఆయన చెప్పారు.