బిజెపికి ఆంధ్రప్రదేశ్ ఉసురు తగిలింది

First Published May 19, 2018, 7:23 PM IST
Highlights

ర్ణాటక పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఒక్కరొక్కరే స్పందిస్తున్నారు. 

అమరావతి: కర్ణాటక పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఒక్కరొక్కరే స్పందిస్తున్నారు. బిజెపికి ఆంధ్రప్రదేశ్ ఉసురు తగిలిందని డిప్యూటీ సిఎం కెఈ కృష్ణ మూర్తి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపి ఇప్పటికైనా ఆలోచించుకోవాలని అన్నారు. శాంతిభద్రతల పేరు చెప్పి కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. 

మెజార్టీ లేదని తెలిసి కూడా కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బిజెపి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కర్ణాటకలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై ఆయన శనివారం మీడియా సమావేశంలో స్పందించారు. 

కర్ణాటక పరిణామాలకు బీజేపీ బాధ్యత వహించాలని ఆయన అన్నారు. కర్ణాటక అసెంబ్లీలో జాతీయ గీతాన్ని అవమానించినందుకు బీజేపీ నేతలు జాతికి క్షమాపణలు చెప్పాలని యనమల డిమాండ్ చేశారు.

కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు నీతి నిజాయితీలకు కట్టుబడి ఉన్నారని, కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగలేదని మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం ఏర్పడినా బీజేపీ వెంటాడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

యశ్వంత్ సిన్హా లాంటి సీనియర్ నాయకుడే మోడీతో దేశానికి ప్రమాదమని చెప్పి ఆ పార్టీకి రాజీనామా చేశారని ఆయన అన్నారు. మోడీని తెర వెనుక నుంచి ప్రేమించే జగన్‌లాంటి వారికి ఇది షాక్ అని అన్నారు. మోడీ-అమిత్ షా పతనం ప్రారంభమైందని, మాజీ ప్రధాని ఇందిరగాంధీ కన్నా ఘోరమైన పాపాలను మోడీ ప్రభుత్వం చేసిందని సోమిరెడ్డి అన్నారు.

ఈరోజును ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా పరిగణించాలని మంత్రి జవహర్‌ అన్నారు. కుట్రలు, కుతంత్రాలకు చరమగీతం పాడిన రోజు ఇదేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో డబ్బు, అధికారం పనిచేయవని అని ఆయన అన్నారు. కర్ణాటక పరిణామాలు గాలి జనార్దన్‌రెడ్డి, జగన్‌ లాంటి వ్యక్తులకు చెంపపెట్టు అని జవహర్‌ అని అన్నారు.

click me!