
ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Goutham Reddy) హఠాన్మరణం చెందారు. ఈ ఉదయం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన గౌతమ్ రెడ్డి చికిత్స పొందుతూ కన్నుమూశారు. వారం రోజుల దుబాయ్ పర్యటన ముగించుకుని నిన్ననే గౌతమ్ రెడ్డి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆయనకు గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రత్యేక వైద్యుల బృందం చికిత్స అందించినప్పటికీ ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. గౌతమ్ రెడ్డి మరణించిన విషయాన్ని వైద్యులు ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో మేకపాటి కుటుంబంతో పాటు, వైసీపీ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.
గౌతమ్ రెడ్డి 1971 నవంబర్ 2వ తేదీన గౌతమ్ రెడ్డి జన్మించారు. ఆయన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తనయుడు. గౌతమ్ రెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండం బ్రాహ్మణపల్లి. ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ యూనివర్సిటీలో గౌతమ్ రెడ్డి ఎమ్మెస్సీ పూర్తి చేశారు. వైసీపీ ఆరంభం నుంచి మేకపాటి కుటుంబం వైఎస్ జగన్‌తోనే ఉంది. నెల్లూరు జిల్లా నుంచి పారిశ్రామిక వేత్తగా ఉన్నారు.
మేకపాటి గౌతమ్ రెడ్డి 2014లో రాజకీయ ప్రవేశం చేశారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి వైసీపీ తరఫున బరిలో నిలిచిన గౌతమ్ రెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం వైఎస్ జగన్ కేబినెట్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే ఆయనకు గుండెపోటు రావడంతో.. ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించింది. ఆయన మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, హైదరాబాద్‌లో ఉన్న వైసీపీ నాయకులు ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు.
గౌతమ్ రెడ్డి మృతిపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ హైదరాబాద్ బయలుదేరి వచ్చే అవకాశం ఉంది. గౌతమ్ రెడ్డి మృతి పట్ల పలువురు ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ శ్రేణులు తమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
రెండు సార్లు ఆయన కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. కోవిడ్ ఆనంతర పరిణామాల వల్ల గౌతమ్ రెడ్డి మరణించి ఉంటారా అనే అనుమానం వ్యక్తమవుతోంది. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులందరూ ఆస్పత్రికి వచ్చారు. దుబాయ్ లో సమావేశాల్లో పాల్గొన్నారు. అక్కడ ఆయన ఏమైనా ఒత్తిడికి గురయ్యారా అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది.