
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆస్పత్రిలో చేరారు. ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. డాక్టర్లు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వారం రోజుల దుబాయ్ పర్యటన ముగించుకుని నిన్ననే గౌతమ్ రెడ్డి హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించారు.
ఏడు రోజుల పాటు దుబాయ్ లో పర్యటించి ఆదివారంనాడు గౌతమ్ రెడ్డి హైదరాబాదు చేరుకున్నారు. అస్వస్థతకు గురి కావడంతో అపోలో ఆస్పత్రిలో చేరారు. వైద్యుల బృందం ఆయనకు అత్యవసర చికిత్స అందించింది. పల్స్ కూడా దొరకకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. పారిశ్రామికవేత్త అయిన గౌతమ్ రెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశ్రమల శాఖను అప్పగించారు.
అయితే, గౌతమ్ రెడ్డిని వైద్యులు కాపాడలేకపోయారు. ఆయన హఠాన్మరణం చెందారు. ఈ విషయాన్ని వైద్యులు ఆయన భార్యకు తెలియజేశారు. గౌతమ్ రెడ్డి 2014లో రాజకీయ ప్రవేశం చేశారు. ఆయన ఐటి మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. గౌతమ్ రెడ్డి విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా తీశారు. జగన్ హైదరాబాదు బయలుదేరి వచ్చే అవకాశం ఉంది.
రెండు సార్లు ఆయన కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. కోవిడ్ ఆనంతర పరిణామాల వల్ల గౌతమ్ రెడ్డి మరణించి ఉంటారా అనే అనుమానం వ్యక్తమవుతోంది. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులందరూ ఆస్పత్రికి వచ్చారు. దుబాయ్ లో సమావేశాల్లో పాల్గొన్నారు. అక్కడ ఆయన ఏమైనా ఒత్తిడికి గురయ్యారా అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది. అంత హఠాత్తుగా గౌతమ్ రెడ్డి గుండెపోటుకు గురి కావడానికి కారణమేమిటనే విషయంపై జగన్ ఆరా తీస్తున్నట్లు సమాచారం.