
అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్య విబేధాలున్నాయని ఏపీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రధాని నోటివెంట ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా రావడంలేదు... కానీ అమిత్ షా, జెపి నడ్డా మాత్రం ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. దీన్నిబట్టి మోదీతో అమిత్ షా, నడ్డాకు గ్యాప్ వచ్చిందేమోనని అనుమానాలు కలుగుతున్నాయని మంత్రి సత్యనారాయణ పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎం జగన్ ను అనేక సందర్భాల్లో మెచ్చుకున్నారని ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వంపై నమ్మకంతోనే కేంద్రం రూ.23వేల కోట్లు విడుదల చేసిందని అన్నారు. గతంలో చంద్రబాబు ఎన్నిసార్లు ప్రధానిని కోరినా పైసా కూడా ఇవ్వలేదని అన్నారు. దీన్నిబట్టే ప్రధానికి జగన్ పై ఎంత నమ్మకం వుందో అర్థమవుతుందని అన్నారు.
అయితే ఇటీవల విశాఖలో అమిత్ షా, అంతకుముందు శ్రీకాళహస్తిలో జేపి నడ్డా వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ పై అర్ధరహిత వ్యాఖ్యలు చేసారని మంత్రి సత్యనారాయణ పేర్కొన్నారు. బిజెపిలోని టిడిపి కోవర్టులు ఇచ్చిన స్క్రిప్ట్ నే వీరు చదివారని అన్నారు. టిడిపి సానుభూతిపరులను పక్కన పెట్టుకుని బిజెపి అగ్రనేతలు వైసిపి ప్రభుత్వం, జగన్ పాలనపై చౌకబారు ఆరోపణలు చేసారన్నారు.
అసలు టిడిపి మాటలునమ్మి సుపరిపాలన అందిస్తున్న జగన్ సర్కార్ పై విమర్శలు చేయడానికి అమిత్ షా కు సిగ్గుండాలి అంటూ కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. ఇటీవల చంద్రబాబు డిల్లీ పర్యటనకు వెళ్లివచ్చిన తర్వాతే బిజెపి అగ్రనాయకుల తీరులో మార్పు వచ్చిందని... జగన్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడం ప్రారంభించారని అన్నారు. బిజెపి - టిడిపి కలిస్తే జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు వుంటుందని ఎద్దేవా చేసారు. చంద్రబాబుతో లోపాయికారి ఒప్పందంతో బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న ప్రతిసారి బీజేపీ పాతాళానికి వెళ్ళిపోయిందని మంత్రి పేర్కొన్నారు.
ప్రభుత్వాన్నో, ముఖ్యమంత్రినో తిడితే తెలుగు ప్రజలు మెచ్చుకుంటారని అనుకుంటే బిజెపి నాయకులు పొరపడినట్లేనని మంత్రి అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదానో, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటేనో ఆంధ్రులు సంతోషిస్తారని సత్యనారాయణ అన్నారు.
ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వారాహి యాత్రపైనా కొట్టు సత్యనారాయణ కామెంట్స్ చేసారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రచారం కోసం వారాహి యాత్ర చేసుకుంటే మాకేమీ ఇబ్బంది లేదని అన్నారు. ఆయన వెంట కొందరు యువత మాత్రమే వెళ్తారని... ప్రజలంతా వైసిపి పక్షానే నిలబడతారని అన్నారు. చివరకు పవన్ ను ఆయన సొంత సామాజికవర్గమే నమ్మడంలేదని... మోసం చేస్తున్నాడని కాపు లకు అర్థమయ్యిందని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.