ప్రజల ముందుకు వెళ్లే ధైర్యం లేకే చంద్రబాబు మరోసారి ఎన్టీఆర్ పేరు ఎత్తుతున్నారని ఏపీ రాష్ట్ర మంత్రి కొడాలి నాని విమర్శించారు. ఎన్టీఆర్ ను ఇబ్బంది పెట్టిన చంద్రబాబుకు రాజకీయంగా ఎన్టీఆర్ అభిమానులు సమాధి కడతారన్నారు.
తాడేపల్లి: ఎన్టీఆర్ పేరుతో మరోసారి చంద్రబాబు మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు.మంగళవారం నాడు తాడేపల్లిలో ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి Kodali Nani మీడియాతో మాట్లాడారు.Chandrababuకు స్వంతంగా ప్రజల ముందుకు వెళ్లే ధైర్యం లేకపోవడంతోనే ఎన్టీఆర్ పేరును జపిస్తున్నారని మంత్రి నాని విమర్శించారు.వచ్చే ఎన్నికల్లో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోతుందని తెలిసి మళ్లీ ఎన్టీఆర్ నామ జపం చేస్తున్నారని మంత్రి నాని విమర్శలు చేశారు.
NTRకు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొన్నారన్నారు. ఎన్టీఆర్ ను పార్టీ నుండి ఎందుకు పంపారని మంత్రి కొడాలి నాని TDP నేతలను ప్రశ్నించారు. ఎన్టీఆర్ ను మోసం చేసిన మిమ్మల్ని ఏం అనాలని మంత్రి అడిగారు.ఎన్టీఆర్ పై చంద్రబాబకు ఎలాంటి ప్రేమ లేదన్నారు. ఎన్టీఆర్ పేరేత్తే అర్హత కూడా ఈ టీడీపీ నేతలకు లేదన్నారు. మీరే పార్టీ లాక్కుంటారు, మీరే వెన్నుపోటు పొడుస్తారు, మీరే మళ్లీ ఎన్టీఆర్ ఫోటోకు దండలు వేస్తారా అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు.చంద్రబాబును, లోకేషన్ ను ఎన్టీఆర్ అభిమానులు రాజకీయంగా సమాధి చేస్తారని మంత్రి కొడాలి నాని శాపనార్ధాలు పెట్టారు.
73 ఏళ్ల వయస్సులో రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 73 ఏళ్ల వయస్సులో కూర్చొని లేవలేని స్థితిలో ఉన్న చంద్రబాబు పార్టీని పరుగులు పెట్టిస్తాడా అని నాని ప్రశ్నించారు.
ఇంత కాలం పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన చంద్రబాబు ప్రజలు గుర్తు పెట్టుకొనే ఏ ఒక్కపథకాన్నైనా ప్రారంభించారో చెప్పాలన్నారు. చంద్రబాబు కారణంగానే టీఆర్ఎస్ ఏర్పడిందన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిన చంద్రబాబు ఏపీకి పారిపోయి వచ్చాడని ఆయన ఎద్దేవా చేశారు.
ఎన్టీఆర్ నుండి పార్టీని లాక్కున్న సమయంలో ఆ పార్టీ బలంగా ఉందన్నారు. కానీ ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఏమిటన్నారు. తెలంగాణలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయిందన్నారు. ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లో కూడ టీడీపీ పోటీ చేయని దుస్థితికి చేరుకొందన్నారు.