బీఆర్ఎస్సే కాదు.. ఎవరొచ్చినా ఏం కాదు, వైసీపీ ఎవరికీ భయపడదు : మంత్రి జోగి రమేశ్

By Siva KodatiFirst Published Oct 5, 2022, 3:46 PM IST
Highlights

టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌‌గా మారుస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై ఏపీ మంత్రి జోగి రమేశ్ స్పందించారు. బీఆర్ఎస్సే కాదు ఏ పార్టీ వచ్చినా వైసీపీని ఏమీ చేయలేవని ... తాము ఎవరికీ భయపడే రకం కాదని జోగి రమేశ్ స్పష్టం చేశారు.

జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాలని భావిస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తున్నట్లు బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే.. మరికొందరు మాత్రం తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో ఏపీకి చెందిన వైసీపీ సీనియర్ నేత, మంత్రి జోగి రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదన్నారు. కేసీఆర్ ఏ పార్టీ అయినా పెట్టుకోవచ్చని.. మా ప్రాంత ప్రజలు, అభివృద్ధే తమకు ముఖ్యమని జోగి రమేశ్ పేర్కొన్నారు. తాము ఎవరి జోలికి వెళ్లమని... బీఆర్ఎస్ ప్రభావమేమి వుండదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఎంతోమంది పార్టీలు పెట్టుకుంటూ వుంటారని.. వారి ఆలోచనలను బట్టి నిర్ణయాలు వుంటాయని జోగి రమేశ్ స్పష్టం చేశారు. వైసీపీకి ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని.. మరో 20 ఏళ్ల దాకా జగన్మోహన్ రెడ్డే సీఎంగా వుంటారని రమేశ్ వెల్లడించారు. 

జగన్మోహన్ రెడ్డి గురించో, ఏపీ గురించో మాట్లాడితే కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేయొచ్చని తెలంగాణకు చెందిన కొందరు మంత్రులు భావిస్తున్నారని జోగి రమేశ్ మండిపడ్డారు. బీఆర్ఎస్సే కాదు ఏ పార్టీ వచ్చినా వైసీపీని ఏమీ చేయలేవని ... తాము ఎవరికీ భయపడే రకం కాదని జోగి రమేశ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమవైపే వున్నారని.. వైసీపీ చేపట్టినన్ని సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలో అమలు కావడం లేదని రమేశ్ పేర్కొన్నారు. 

ALso REad:తెలంగాణ మోడల్ దేశంలో అమలు కావాలి: టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్

అంతకుముందు తెలంగాణ మోడల్ దేశంలో అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్ . బుధవారం నాడు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ విస్తృతస్థాయి  సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ తీర్మానం చేశారు. ఈ తీర్మానానికి ముందుగా కేసీఆర్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగించారు. జాతీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు దారి తీసిన పరిస్థితులను కేసీఆర్ వివరించారు. జాతీయ రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లాల్సి వస్తుందనే విషయమై కేసీఆర్ వివరించారు.

బీజేపీ అనుసరిస్తున్న విధానాల వల్ల  దేశంలో వెనుకబడిపోతుందన్నారు. బంగ్లాదేశ్ కంటే మన దేశం వెనుకబడి ఉండడం ఏమిటని కేసీఆర్ ప్రశ్నించారు. అఖిలేష్ యాదవ్ ను ఈ సమావేశానికి రావొద్దని తానే చెప్పినట్టుగా తెలిపారు. ములాయం సింగ్ యాదవ్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని కేసీఆర్ వెల్లడించారు. ఈ కారణంగానే తాను అఖిలేష్ ను రావొద్దని చెప్పానని... ములాయం కోలుకున్న తర్వాత అందరం కలిసి వస్తారనే ఆకాంక్షను కేసీఆర్ వ్యక్తం చేశారు. దేశ ప్రజల కోసమే బీఆర్ఎస్ ను ఏర్పాటు చేస్తున్నట్టుగా సీఎం చెప్పారు. రైతు సంక్షమమే ఎజెండాగా ముందుకు సాగుతామని కేసీఆర్ వివరించారు. మహరాష్ట్ర నుండి పర్యటనను ప్రారంభించనున్నట్టుగా ఆయన ప్రకటించారు. కర్ణాటకలో కూడా మన జెండా ఎగురాలని కేసీఆర్ ఆకాంక్షించారు. 

click me!