తన నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దులో ఉందని ఎవరైనా మద్యం కర్ణాటక నుండి తెచ్చుకొంటే తానేం చేయగలనని మంత్రి గుమ్మనూరు జయరాం ప్రశ్నించారు. బుధవారం నాడు ఆయన ఏపీ సీఎం జగన్ తో భేటీ అయ్యారు.ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ సీఎంగా ఉన్నంత కాలం తనను ఎవరూ ఏమీ చేయలేరన్నారు. తాను దాదాగిరి చేయడం లేదన్నారు.
అమరావతి: దాదాగిరి చేయడానికి తానేమీ అంతరాష్ట్ర స్మగ్లర్ వీరప్పన్ ని కాదని ఏపీ రాష్ట్ర కార్మిక శాఖమంత్రి గుమ్మనూరు జయరాం చెప్పారు.బుధవారంనాడు అమరావతిలో ఏపీ సీఎం వైఎస్ జగన్ తో ఆయన భేటీ అయ్యారు. తన నియోజకవర్గంలోని అస్పరిలో ఇసుక ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేసిన విషయమై ఆయన ఎస్ఐతో ఫోన్‌లో మాట్లాడిన ఆడియో సంభాషణ ఒకటి మీడియా కలకలం రేపింది. ఈ విషయమై ఆయన సీఎం జగన్ కు వివరణ ఇచ్చినట్టుగా సమాచారం. సీఎంతో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
అస్పరి పరిధిలో పోలీసులు ఖాళీ ఇసుక ట్రాక్టర్లు పట్టుకొంటే వదిలేయాలని తాను చెప్పిన మాట నిజమేనని జయరాం ఒప్పుకొన్నారు.ఎస్ఐతో తాను దౌర్జన్యంగా మాట్లాడితే తనది తప్పన్నారు. కానీ తాను ఎస్ఐతో మాట్లాడినదానిలో తప్పు లేదని ఆయన తన మాటలను సమర్ధించుకొన్నారు.తన నియోజకవర్గంలోని సమస్యలపై సీఎంతో చర్చించానన్నారు. ఇతర అంశాలు చర్చించలేదని ఆయన స్పష్టం చేశారు.
తన నియోజకవర్గం కర్ణాటకకు సరిహద్దులో ఉంటుందన్నారు. మద్యం అలవాటున్నవారు కర్ణాటకకు వెళ్లి మద్యం తెచ్చుకొంటే తాను కాచుకొని కూర్చుంటానా అని ఆయన ప్రశ్నించారు. జగన్ సీఎంగా ఉన్నంత కాలం తనను ఎవరూ ఏమీ చేయలేరన్నారు.