జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ విమర్శలు చేశారు. వారాహి యాత్ర ప్రారంభాన్ని పురస్కరించుకొని నిన్న విశాఖపట్టణంలో పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ పై చేసిన విమర్శలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు.
విశాఖపట్టణం: పవన్ కళ్యాణ్ కు పొలిటికల్ ప్రొడ్యూసర్ చంద్రబాబునాయుడని ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ విమర్శించారు.జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఓ విధానం, ఓ సిద్ధాంతం , ఓ స్థిరత్వం లేదని ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ విమర్శించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ శుక్రవారంనాడు విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు.
విశాఖపట్టణం నుండి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ నెల 10వ తేదీ నుండి వారాహి మూడో విడత యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా విశాఖ జగదాంబ సెంటర్ లో ఏపీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు.ఈ విమర్శలకు ఏపీ మంత్రి అమర్‌నాథ్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలన్నారు. మిమ్మల్ని నమ్ముకున్న పార్టీ శ్రేణులకు భరోసాను కల్పించకుండా ఎవరికో బానిస బతుకు బతుకుతున్నారని పవన్ కళ్యాణ్ పై మంత్రి అమర్ నాథ్ విమర్శలు చేశారు.
పవన్ కళ్యాణ్ బీజేపీతో సంసారం చేస్తూ టీడీపీతో సహజీవనం చేస్తున్నారని మంత్రి అమర్ నాథ్ జనసేనానిపై వ్యాఖ్యలు చేశారు. పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆరేడు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారని మంత్రి గుర్తు చేశారు.వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ ప్రసంగం విషం, విద్వేషం, అహంకారంతో సాగిందన్నారు.సీఎం పదవి నుండి జగన్ ను దించేయాలన్న అసూయ పవన్ కళ్యాణ్ లో కన్పిస్తుందని చెప్పారు.
సీఎం ను తిడితే నాయకుడు అయిపోతానని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టుగా కన్పిస్తుందన్నారు. సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ నోరు పారేసుకోవడాన్ని మంత్రి తప్పుబట్టారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి అధికారం అప్పగిస్తే ప్రజలకు ఏం చేస్తామో చెప్పకుండా జగన్ ను తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. చంద్రబాబు స్క్రిప్ట్‌నే పవన్ కళ్యాణ్ చదువుతున్నారన్నారు.