
గుంటూరు : ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆమె తాజాగా గురువారంనాడు కొత్తూరు మండలం గూనభద్ర వద్ద టిడిపి అధినేత చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత ఆమె విలేకరులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె చంద్రబాబును ఆకాశానికి ఎత్తారు. ఆంధ్రప్రదేశ్లో టిడిపి హవా కనిపిస్తుందన్నారు. తనకు రక్షణ కల్పించాలని చంద్రబాబును కలిసినట్లుగా తెలిపారు.
ఆమె ఏమన్నారంటే… ‘నేను కష్టాల్లో ఉండి, కన్నీరు పెట్టుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ నాకు మద్దతు ఇచ్చారు. వైసీపీ గూండాలు కార్యకర్తలు నా మీద, నా ఆఫీస్ మీద దాడి చేశారు. తీవ్రభయాందోళనలకు గురి చేశారు. రాష్ట్రంలో ఉండాలంటేనే వణికి పోయేలా చేశారు. ప్రస్తుతం నేను తెలంగాణలో ఉన్నాను.
నాకు రక్షణ కల్పించాలని కోరడానికి... అలాగే కృతజ్ఞతలు తెలుపుకునేందుకుచంద్రబాబు నాయుడును కలిసాము. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నాలుగున్నర నెలల్లో ఏ పార్టీలో చేరాలి. ఏం చేయాలనేది ఆలోచించాను. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి హయాంలో ఏం జరిగింది… వైసీపీ హయాంలో ఏం జరిగింది.. అనే విషయాన్ని బేరీజు వేసుకున్నాను.
అమరావతిలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు కూడా అన్యాయం జరిగింది. రానున్న ఎన్నికల్లో వీటన్నింటికీ ప్రతిఫలం ప్రజలే చూపిస్తారు. లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర నా నియోజకవర్గంలోకి చేరుకునే సమయానికి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తాను’ అని ఉండవల్లి శ్రీదేవి చెప్పుకొచ్చారు.