అమరావతి రైతుల మహా పాదయాత్ర ఉత్తరాంధ్రపై దండయాత్ర: ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్

By narsimha lode  |  First Published Sep 9, 2022, 5:47 PM IST


అమరావతి రైతుల మహ పాదయాత్రను ఉత్తరాంధ్ర ప్రజలపై దండయాత్రగా భావిస్తున్నామని ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చెప్పారు. మూడు రాజధానులను ఏర్పాటు చేసి తీరుతామన్నారు. 


అమరావతి: మూడు రాజధానులను ఏర్పాటు చేసి తీరుతామని ఏపీ రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్ నాథ్ చెప్పారు.

శుక్రవారం నాడు విశాఖపట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానులపై స్పష్టమైన బిల్లును మళ్లీ అసెంబ్లీలో ప్రవేశ పెడతామన్నారు. గతంలో రాజధానిపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును సవరించి కొత్త బిల్లు పెట్టాలనే ఆలోచన చేశామని, అయితే కోవిడ్ కారణంగా ఇది కొంత ఆలస్యం అయిందని ఆయన వివరించారు.  అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ క్షణంనుంచైనా విశాఖ నుంచి పాలన ఆరంభించవచ్చన్నారు.. విశాఖను పరిపాలనా రాజధానిగా చేసి ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలన్న సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారన్నారు. కానీ అమరావతి ప్రాంత ప్రజలను రెచ్చగొట్టి  అరసవెల్లి యాత్రకు ఉసిగొల్పారని ఆయన విమర్శించారు. 

Latest Videos

undefined

అమరావతి రైతుల పాదయాత్రను  ఉత్తరాంధ్ర ప్రజలపై చేస్తున్న దండయాత్రగా భావిస్తున్నామని మంత్రి అమర్ నాధ్  చెప్పారు. అమరావతిలో జరిగిన పుస్తకావిష్కరణ సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా ఇతర పార్టీ నేతలు ముఖ్యమంత్రి గురించి చులకనగా,అవహేళనగా మాట్లాడడం సరికాదన్నారు.

ఈ సభలో చంద్రబాబుతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంత నాయకులు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే వారు కూడా విశాఖ ప్రాంత వ్యతిరేకులుగా భావించవలసి వస్తోందని మంత్రి చెప్పారు.  రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలనే ఉద్దేశ్యంతో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం ముందుకు తెచ్చిందన్నారు. మూడురాజధానులను  వైసీపీ  మినహా ఇతర రాజకీయ పార్టీల నేతలు వ్యతిరేకించడం అన్యాయమన్నారు.

 అమరావతిలోని 29 గ్రామాలు మాత్రమే అభివృద్ధి చెందాలని, రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదన్న భావనతోనే ఈ సభను ఏర్పాటు చేసినట్లు అర్థం అవుతోందని  మంత్రి చెప్పారు.  అమరావతిని కూడా కలుపుకొని మూడురాజధానులు చేసి చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. 

 అమరావతి ఒకటే రాజధానిగా చేస్తే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందక పోవడమే కాకుండా రాజధాని నిర్మాణానికి లక్షా 10 వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. రాష్ట్రంలో రూ.15వేల కోట్లతో నాడు నేడు వంటి బృహత్తర కార్యక్రమం, ఆసుపత్రుల అభివృద్ధి, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలను చేపట్టామని ఆయన గుర్తు చేశారు. 

 విశాఖకు రాజధాని వద్దని చెప్పిన తర్వాత మొదటి సారి విశాఖ వచ్చిన చంద్రబాబును ఇక్కడి ప్రజలు ఎలా వెనక్కి పంపించారో అందరికీ తెలుసనన్నారు. ఉత్తరాంధ్రపై దండయాత్ర చేయడానికి వివిధ పార్టీల నాయకులను చంద్రబాబు  రెచ్చగొట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. 

 పాదయాత్రల పేరుతో దండయాత్రలు చేస్తే చూస్తూ ఊరుకోరని మంత్రి హెచ్చరించారు. హైదరాబాద్ అభివృద్ధికి తానే శంకుస్థాపన చేశానని చెప్పుకుంటూ పిచ్చిపట్టినట్టు వ్యవహరిస్తున్న చంద్రబాబును వదిలేస్తే చార్మినార్ కూడా తానే కట్టేననేని చెబుతాడని మంత్రి సెటైర్లు వేశారు. 

 హైదరాబాద్  అంతగా అభివృద్ధి చేసి ఉంటే ఆ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎందుకు కనుమరుగు అయిందని అమర్ నాథ్ ప్రశ్నించారు.  హైటెక్ సిటీకి అప్పటి ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేస్తే చంద్రబాబునాయుడు ప్రారంభోత్సవం మాత్రమే చేశారని ఆయన చెప్పారు. రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే లక్షలాది మందికి ఉద్యోగాలు లభించాయని మంత్రి ప్రస్తావించారు. 

చంద్రబాబు నాయుడు హయాంలో విజయవంతంగా పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్ట్ హెరిటేజ్ ఒక్కటేనని మంత్రి  ఎద్దేవా చేశారు. పేదవాడికి సైతం ఉన్నత విద్య, వైద్యం అందించాలన్న మంచి ఆలోచన చంద్రబాబుకి ఎప్పుడైనా వచ్చిందా? అని ప్రశ్నించారు. 

అమరావతిలో పేదవారిని చంపి ధనవంతులని బతికించాలన్న దురాలోచన కలిగిన చంద్రబాబు స్వలాభాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన భాద్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అందుకే పాదయాత్రకు అనుమతులు నిరాకరించామని ఆయన తెలిపారు.. ఒకప్పుడు అమరావతి దేవతల రాజధాని. చంద్రబాబు నిర్మించాలనుకున్నది దెయ్యాల, రాక్షసుల రాజధాని అని మంత్రి అమర్ నాథ్ చెప్పారు. 

also read:అమరావతి రైతుల మహా పాదయాత్ర: ఏపీ హైకోర్టు అనుమతి

బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు మూడు రాజధానులు గురించి చేసిన వ్యాఖ్యలపై అమర్ నాథ్ స్పందించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆయన స్పష్టమైన వివరణ ఇచ్చిన తర్వాతే ఈ విషయం గురించి మాట్లాడాలని జీవీఎల్ నరసింహరావును కోరారు. 

 

click me!