వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అమరావతి రైతులతో కుదుర్చుకున్న ఒప్పందంలో రాజధాని అని ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు.
అమరావతి: వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.సోమవారంనాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అమరావతిపై తమ ప్రభుత్వం ఏనాడూ యూ టర్న్ తీసుకోలేదన్నారు. గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నట్టుగా మంత్రి బొత్స హామీ ఇచ్చారు.ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒప్పందానికి కట్టుబడి ఉన్నట్టుగా మంత్రి స్పష్టం చేశారు. రైతులతో అప్పటి ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో రాజధాని అనే పదం ఎక్కడుందని మంత్రి ప్రశ్నించారు. మూడు రాజధానులపై పునరాలోచన లేనే లేదని మంత్రి స్పష్టం చేశారు. సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చిన సమయంలోనే వికేంద్రీకరణ ప్రారంభమైందని ఆయన చెప్పారు.
అమరావతితో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్దికి కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. అమరావతిలో నిజమైన రైతులు ఐదు లేదా పది మంది మాత్రమే ఉంటారన్నారు. రైతుల ముసుగులో వ్యాపారస్తులు మాత్రమే ఉన్నారని ఆయన ఆరోపించారు. రైతుల ముసుగులో రియల్ ఏస్టేట్ వ్యాపారుల, దళారులు, అవినీతిపరులున్నారని చెప్పారు. రైతుల పేరుతో పాదయాత్ర చేసిన వారు తమ గుర్తింపు కార్డులను చూపాలని పోలీసులు కోరితే తప్పించుకొని పారిపోయారని ఆయన విమర్శించారు.
undefined
also read:రాజధానులపై ప్రభుత్వాలకే నిర్ణయం: సుప్రీం తీర్పుపై మంత్రి అంబటి
అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేసే విషయమై అందరితో చర్చించి నిర్ణయం తీసుకొంటే బాగుండేదని అప్పటి విపక్ష నేతగా జగన్ చెప్పారని ఆయన గుర్తు చేశారు.ఈ విషయమై తాను ఏదైనా మాట్లాడితే ప్రాంతీయ విబేధాలు వస్తాయని జగన్ ఆనాడు వ్యాఖ్యానించారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రస్తావించారు. రాజధాని కోసం తీసుకొనే భూమి ప్రభుత్వ భూమి అయితే బాగుంటుందని కూడా జగన్ సూచించినట్టుగా చెప్పారు. అమరావతిలో అభివృద్ది పనులను నిర్ధిష్ట కాలపరిమితిలో పూర్తి చేయాలనే విషయమై మంత్రి స్పందించారు. కోర్టులు చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించనని చెబుతూనే నెల రోజులు, మూడు నెలల్లో నిర్మాణాలు చేయడం సాధ్యమా అని ఆయన ప్రశ్నించారు.ఐదేళ్లు చంద్రబాబు ఎందుకు రాజధానిలో నిర్మాణాలు చేయలేదో చెప్పాలన్నారు. అమరావతిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం కోసం ఒక్క అడుగుకి రూ. 10 వేలను చంద్రబాబు సర్కార్ ఖర్చు చేసినట్టుగా చెప్పారు.