ఏపీ రాజధానిపై దాఖలైన పిటిషన్లపై విచారణను ఎందుకు వాయిదా వేయాలని కోరారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. దీని వెనుక ఏదైనా దురుద్దేశ్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు.మూడు రాజధానులపై న్యాయస్థానాన్ని ఒప్పటిస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
అమరావతి: రాజధానిపై దాఖలైన పిటిషన్లపై విచారణను వాయిదా వేయాలని పిటిషనర్లు ఎందుకు కోరారో అర్ధం కావడం లేదని ఏపీ రాష్ట్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.
సోమవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. రాజధానిపై దాఖలైన పిటిషన్లపై రోజువారీ విచారణ చేస్తామని హైకోర్టే చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పిటిషనర్లే విచారణను ఎందుకు వాయిదా వేయాలని కోరారో చెప్పాలన్నారు. విచారణను వాయిదా వేయాలని కోరే అవసరం ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. దీని వెనుక ఏమైనా దురుద్దేశం ఉందా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల అంశానికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
also read:ఏపీ రాజధాని వివాదం... హైకోర్టు విచారణ నవంబర్ 26కు వాయిదా
మూడు రాజధానుల విషయంలో న్యాయస్థానాన్ని ఒప్పిస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. న్యాయస్థానం ఆదేశాలతోనే విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధానిని చేస్తామని ఆయన చెప్పారు.
రాజధానిపై దాఖలైన పిటిషన్లపై విచారణను వాయిదా వేయాలని పిటిషనర్ల తరపున న్యాయవాదులు ఇవాళ హైకోర్టును కోరారు. కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నందున విచారణను వాయిదా వేయాలని పిటిషనర్లు కోరారు. సీఆర్‌డీఏ రద్దు, పాలనా వీకేంద్రీకరణ చట్టాలను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై మార్చి 23న, మే 3వ తేదీన విచారణ జరిగింది. మే 3 వ తేదీ తర్వాత ఇవాళ విచారణ జరిగింది.
ఇవాళ విచారణ సమయంలో పిటిషనర్లు విచారణను వాయిదా వేయాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. దీంతో ఈ పిటిషన్లపై విచారణను నవంబర్ 15కి వాయిదా వేసింది.