ఔను వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు, జగన్ ఫ్యామిలీ ఫుల్ హ్యపీ: జోష్ లో వైసీపీ

By Nagaraju penumalaFirst Published Nov 1, 2019, 1:30 PM IST
Highlights

సీఎం జగన్ కుటుంబానికి చెందిన చిన్నాన్న అయిన వైవీ సుబ్బారెడ్డి ,బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డిలు ఏకం కావడంతో జగన్ ఫ్యామిలీతోపాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం అవుతుంది. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఇదొక శుభపరిణామమని పార్టీ భావిస్తోంది. 

ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కుటుంబంలో జోష్ నింపారు ఇద్దరు వైసీపీ నాయకులు. జగన్ కుటుంబంలోనే కాదు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపునిచ్చారు. ఇంతకీ ఆ ఇద్దరు నాయకులు ఏం చేశారు, వారికి జగన్ కుటుంబానికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా...? తెలుసుకోవాలంటే ప్రకాశం జిల్లా రాజకీయాలకు వెళ్లాల్సిందే. 
 
అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కీలక నేతలైన వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డిలు ఎడమెహం పెడమెహంగా ఉన్నారు. ఇద్దరూ స్వయానా బావ, బావమరుదులైనప్పటికీ రాజకీయ విబేధాల నేపథ్యంలో విడిపోయారు. 

ఎన్నికల్లో ఇద్దరూ కలిసిన పరిస్థితి లేదు. ఇద్దరూ విడిపోవడంతో ప్రకాశం జిల్లా రాజకీయాలు రెండు గ్రూపులగా విడిపోయాయి. ఇకపోతే వైవీ సుబ్బారెడ్డి స్వయానా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి చిన్నాన్న. 

వైయస్ విజయమ్మ చెల్లెలు భర్త వైవీ సుబ్బారెడ్డి. వైవీ సుబ్బారెడ్డి బావమరిది బాలినేని శ్రీనివాస్ రెడ్డి. 2014 ఎన్నికల్లో ఒంగోలు లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు వైవీ సుబ్బారెడ్డి. 

అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో 2019 ఎన్నికల్లో టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. జగన్ టికెట్ ఇవ్వకపోవడానికి బాలినేని శ్రీనివాస్ రెడ్డియే కారణమని వైవీ సుబ్బారెడ్డి అనుచరులు ఆరోపించేవారు. 

తనకు టికెట్ ఇవ్వకపోవడంతో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో అంతగా వేలుపెట్టలేదు వైవీ సుబ్బారెడ్డి. తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలపైనే దృష్టిసారించారు. గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా రాజకీయాలను బాలినేని శ్రీనివాస్ రెడ్డియే చూసుకున్నారు. 

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లా రాజకీయాల్లో విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా పర్చూరు నియోజకవర్గం నుంచి మెుదలు పెడితే అద్దంకి, చీరాల, కొండపి, దర్శి నియోజకవర్గాల వరకు పార్టీలో కుమ్ములాటలు మెుదలయ్యాయి. 

పర్చూరు నియోజకవర్గంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డిలను ఏకం చేస్తేగానీ సమస్య పరిష్కారం అయ్యేలా లేదని భావించారు. 

పర్చూరు నియోజకవర్గంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు టాపిక్ తెరపైకి రావడంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి హాట్ టాపిక్ గా మారారు. దగ్గుబాటి కుటుంబానికి జగన్ కు మద్య రాయబారం నడిపారు. సమస్య ఓ కొలిక్కిరాకపోవడంతో సీఎం జగన్ ఆ బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డి, జిల్లా పరిశీలకులు సజ్జల రామకృష్ణారెడ్డిలకు అప్పగించారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డిలు కలుసుకున్నారు. వైవీ సుబ్బారెడ్డి నివాసానికి మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సమేతంగా వెళ్లారు. కాసేపు కుటుంబ వ్యవహారాలు మాట్లాడుకున్నారు. 

అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి వైవీ సుబ్బారెడ్డి నివాసానికి చేరుకున్నారు. ముగ్గురు కలిసి ప్రకాశం జిల్లా రాజకీయాలపై చర్చించారు. పర్చూరు నియోజకవర్గానికి సంబంధించి వారం రోజుల్లో క్లారిటీ తెచ్చేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. 

దగ్గుబాటినే పర్చూరు నియోజకవర్గ ఇంఛార్జ్ గా కొనసాగించాలా లేకపోతే వేరేవారికి ఇవ్వాలా అన్న కోణంలో చర్చించారు. రామనాథంబాబుకు సెంట్రల్ బ్యాక్ పర్సన్ ఇంఛార్జిగా నియమించడంతో ఆయనను తప్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

దగ్గుబాటిని తప్పిస్తే గొట్టిపాటి భరత్ కు ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించాలా అన్న అంశంపై కూడా చర్చించారు. రెండు రోజుల్లో సీఎం జగన్ ను కలిసి చర్చల సారాంశాన్ని వివరించనున్నట్లు తెలుస్తోంది. 
 
ఇకపోతే అద్దంకి ఇంఛార్జిగా కృష్ణచైతన్య బాధ్యతలు అప్పగించిన వ్యవహారంపై కూడా చర్చించారు. గత ఏడాది బాచిన కృష్ణచైతన్య తండ్రి గరటయ్య పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన కృష్ణ చైతన్యను ఇంఛార్జ్ గా నియమించింది వైసీపీ. 

అలాగే కొండపి, దర్శి, చీరాల నియోజకవర్గాల ఇంఛార్జ్ ల వ్యవహారంపై కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో ప్రకాశం జిల్లా రాజకీయాలను ఓ కొలిక్కి తెచ్చేందుకు నేతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 

ఇకపోతే జగన్ కుటుంబానికి చెందిన చిన్నాన్న అయిన వైవీ సుబ్బారెడ్డి ,బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డిలు ఏకం కావడంతో జగన్ ఫ్యామిలీతోపాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం అవుతుంది. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఇదొక శుభపరిణామమని పార్టీ భావిస్తోంది. 

ఈ వార్తలు కూడా చదవండి

బాలినేనితో విభేదాలే వైవీ సీటుకు ఎసరు: రాత్రి రాత్రే మాగుంట

జగన్ పై అలకవీడిన బాబాయ్ వైవీ: వైసిపిలో జోష్

అలకవీడని బాబాయ్ : జగన్ వ్యాఖ్యలతో వైవీ సుబ్బారెడ్డి మరింత దూరం

click me!