అందుకే చేశారా: ఈసీ నిమ్మగడ్డ కూతురిని ప్రస్తావించి అనిల్ ఫైర్

By telugu team  |  First Published Mar 16, 2020, 12:11 PM IST

ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ఆంధ్రప్రదేశ్ మంత్రి అనిల్ కుమార్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ కూతురు పనిచేసే సంస్థను ప్రస్తావించి ఆయనపై అనిల్ కుమార్ ఆరోపణలు చేశారు.


అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక వ్యక్తి కోసం, తన సామాజిక వర్గానికి చెందిన పార్టీ బాగుండాలని స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం బాధాకరమని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. కరోనా పేరుతో ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదని ఆయన అన్నారు. టీడీపీకి అభ్యర్థులు నిలబెట్టేందుకు దిక్కులేదని, అందుకే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను అడ్డం పెట్టుకున్నట్టు ఉందని ఆయన అన్నారు. 

ఎన్నికల కమిషన్ కు విచక్షణాధికారం ఉంది గానీ విచక్షణ కోల్పోయి నిర్ణయం తీసుకునే అధికారం ఎక్కడిదని ఆయన అడిగారు. కరోనా వైరస్ కోసం ఎన్నికలు వాయిదా వేసే ముందు రాష్ట్రంలో అధికారులను ఎవరిని సంప్రదించారని ఆయన అడిగారు. 45 రోజులు ఎన్నికల కోడ్ ఉందని అంటూ చంద్రబాబు కుట్ర పూరిత రాజకీయాల కు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు 

Latest Videos

ఎన్నికల కమిషనర్ కూతురుగతంలో ఈడీబీలో పని చేశారని, దానికి ప్రతిఫలంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారేమో చెప్పాలని ఆయన అన్నారు. దీనికోసం రాష్ట్ర అభివృద్ధి ని ఫణంగా పెడతారా అని ప్రశ్నించారు. ఎన్నికలు ఆపేసిన తర్వాత అధికారులను బదిలీ చేసే అధికారం ఆయనకు ఎక్కడిదని ఆయన అడిగారు. ఫ్రాన్స్ లో 5500 కరోనా కేసులు, 127 మంది చనిపోతే కూడా అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. ఇక్కడ అంత దారుణమైన పరిస్థితి లేదు కదా అని ఆయన అన్నారు. 

కరోనా కన్నా పెద్ద వైరస్ గా చంద్రబాబు తయారు అయ్యారని, ఎన్నికలు ఆపేయాలనే నీచమైన ఎత్తుగడ చంద్రబాబు వేశారని ఆయన విమర్శించారు. ఈసీ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని అనిల్ డిమాండ్ చేశారు.

click me!