జగమొండి భరించలేడు: వైఎస్ జగన్ పై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు

By telugu teamFirst Published Mar 16, 2020, 11:49 AM IST
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ ను ఆయన జగమొండిగా అభివర్ణించారు. కుల ప్రస్తావన చేసి జగన్ ఈసీని దూషించారని చంద్రబాబు మండిపడ్డారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  టిడిపి నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ సోమవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా, నియోజకవర్గ, మండల టిడిపి నేతలు ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో అక్రమాలపై అన్ని చోట్లా ప్రెస్ మీట్ లు పెట్టాలని, అన్ని జిల్లాలలో ఎస్పీలకు, కలెక్టర్లకు వినతులు ఇవ్వాలని ఆయన సూచించారు. 

బలవంతపు నామినేషన్ల ఉపసంహరణలపై ఫిర్యాదు చేయాలని, వైసిపి దుర్మార్గాలపై ఆర్వోలకు ఫిర్యాదులు ఇవ్వాలని కోరారు. మళ్లీ ఇలాంటి తప్పులు చేయాలంటే భయం రావాలని ఆయన అన్నారు. మీ దగ్గర సాక్ష్యాధారాలను ఎన్టీఆర్ భవన్ కు పంపాలని ఆనయ సూచించారు.తమ వద్ద ఉన్న సమాచారాన్ని వారికి పంపించనున్నట్లుఆయన తెలిపారు. చట్టంలో నిబంధనలను తెలుసుకుని పాటించాల్సిందిగా టీడీపీ నేతలకు ఆయన సూచించారు వాటిని ఉల్లంఘిస్తే సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేయాలని చెప్పారు. 

"దొంగతనంగా మా ఇళ్లకు ఎలా వస్తారు, ఎందుకు వస్తారు..? బైండోవర్ చేసేందుకు వస్తే రాసిమ్మని అడగాలి. పౌర స్వేచ్ఛ హరించమని ఏ చట్టం చెప్పదు. రాజ్యాంగంలో ఏ నిబంధన (పౌర స్వేచ్ఛ హరణ) అనుమతించదు. దుర్మార్గాలు చేసినవాళ్లు దర్జాగా తిరుగుతున్నారు. ఏ తప్పు చేయని మనం ఎందుకు భయపడాలి..?" అని చంద్రబాబు అన్నారు.

అనేక చోట్ల వైసిపి దుర్మార్గాలు ధైర్యంగా ఎదుర్కొన్నారని అన్నారు. వైసిపి గుండాల దౌర్జన్యాలను అడ్డుకున్నారని చెప్పారు. ధైర్యంగా ఎదుర్కొన్న అందరికీ ఆయన అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో సాధారణ పాలన పడకేసిందని విమర్శించారు. విధ్వంస పాలన, వివక్ష పాలన నడుస్తోందని ఆయన అన్నారు. తాను చెప్పిందే జరగాలనే జగమొండి పాలన అని, జరగకపోతే జగమొండి భరించలేడని ఆయన జగన్ ను ఉద్దేశించి అన్నారు. 

"చట్టం మనకెంత ముఖ్యమో వాళ్లకూ అంతే ముఖ్యం. మీరు పంపిన 30 వీడియోలే ప్రజాస్వామ్యాన్ని కాపాడాయి. ఉన్మాదులను ఎదుర్కోవడానికి ఇదే సరైన మార్గం. దుర్మార్గ ప్రభుత్వాన్ని నియంత్రించే మార్గం ఇదే.గతంలో బాంబులతో వస్తేనే ధీటుగా ఎదుర్కొన్నాం. ప్రాణాలు ఫణంగా పెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాం" అని ఆయన అన్నారు. అలాంటిది పోలీసులను అడ్డం పెట్టుకుని ఇప్పుడు తప్పుడు కేసులు పెడ్తామంటే భయపడ్తారా అని ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్దమనే సందేశం పంపారని ఆయన చెప్పారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా చూపాలని ఆయన సూచించారు.  ప్రభుత్వ భవనాలకు వైసిపి రంగుల వీడియోలు పంపాలని, హోర్డింగుల ఫొటోలు, వీడియోలు పంపాలని ఆయన సూచించారు. అవకాశవాదులకు పార్టీలో స్థానం ఉండదని, పార్టీ మారేవాళ్లు చరిత్రహీనులుగా మిగులుతారని ఆయన అన్నారు.

ఈసిని కులం పేరుతో దూషణ నీచాతినీచమని ఆయన అన్నారు. 16నెలలు జైల్లో ఉన్న ఏ1, ఏ2 నిందితులు ఈసిని నిందించడం హేయమని అన్నారు. దొంగలు జడ్జిని నిందించడాన్ని ప్రజలే చూస్తున్నారని చెప్పారు. కండిషన్ బెయిల్ లోని నిందితులు రాజ్యాంగ వ్యవస్థ అధిపతిని దూషిస్తున్నారని అన్నారు. ప్రజాక్షేత్రంలో, న్యాయక్షేత్రంలో వీళ్లకు గుణపాఠం తప్పదని చంద్రబాబు హెచ్చరించారు.

click me!