ఏపీ స్థానిక ఎన్నికలు: ముగిసిన ప్రచారం.. రేపటి నుంచి ఎలక్షన్స్, కుప్పంపైనే అందరి దృష్టి

By Siva Kodati  |  First Published Nov 13, 2021, 5:22 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిపోయిన స్థానిక సంస్థలకు ఎన్నికలకు సంబంధించి ప్రచారం ముగిసింది. కుప్పం మున్సిపాలిటీపైనే  అందరి దృష్టి నెలకొంది. టీడీపీ కంచుకోటను బద్ధలు కొట్టాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. 


ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిపోయిన స్థానిక సంస్థలకు ఎన్నికలకు సంబంధించి ప్రచారం ముగిసింది. కుప్పం మున్సిపాలిటీపైనే  అందరి దృష్టి నెలకొంది. టీడీపీ కంచుకోటను బద్ధలు కొట్టాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిన కార్పొరేషన్‌, స్థానిక సంస్థల ఎన్నికలకు (ap local body elections) షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. నవంబర్ 14, 15, 16 తేదీల్లో స్థానిక ఎన్నికలు జరగుతాయని ఈసీ నోటిఫికేషన్‌లో తెలిపింది. గతంలో వివిధ కారణాలతో ఎన్నికలు నిర్వహించని నెల్లూరు కార్పొరేషన్ సహా మున్సిపాలిటీలు, డివిజన్లు, వార్డులతో పాటు జెడ్పీటీసీ, ఎంటీటీసీ స్థానాలకు, పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించనున్నారు.  ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం  నోటిఫికేషన్ జారీచేసింది.

నెల్లూరు కార్పొరేషన్‌ సహా 12 మున్సిపాలిటీలకు, 533 పంచాయతీ వార్డులు, 69 సర్పంచ్‌ పదవులు, 85 ఎంపీటీసీలు, 11 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే.. 7 కార్పొరేషన్లలో 12 డివిజన్లకు, 12 మున్సిపాలిటీల్లో మిగిలిపోయిన 13 వార్డులకు ఎన్నిక జరగనుంది. అన్ని ఎన్నికలకు సంబంధించి ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. పంచాయతీలకు ఈ నెల 14న పోలింగ్‌, అదే రోజు కౌంటింగ్‌ జరగనుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఈనెల 15న పోలింగ్‌, 17న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఈ నెల 16న పోలింగ్‌, 18న ఓట్ల లెక్కింపు జరపనున్నారు. 

Latest Videos

Also Read:ఫేక్ సంతకాలతో ఏకగ్రీవాలు.. అభ్యర్థులు కోర్టుకెళ్తే.. సీఎం, మంత్రులు జైలుకే: చంద్రబాబు వ్యాఖ్యలు

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల (ap local body elections) ఎన్నికల సరళిపై టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు (chandrababu naidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణలకు సంబంధించి ఫోర్జరీ సంతకాల బాగోతం న్యాయస్థానంలోనూ తేలిందని ఆయన గుర్తుచేశారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం తక్షణమే రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.  తిరుపతి (tirupati) స్థానిక ఎన్నికల్లో నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియలో చోటుచేసుకున్న ఫోర్జరీ సంతకాల వ్యవహారానికి సంబంధించిన పలు పత్రాలను ఆయన మీడియాకు చూపించారు. ఆర్వోలు బాధ్యత వహించి విధుల నుంచి వైదొలగాలని... ఫోర్జరీ సంతకానికి బాధ్యుడైన అధికారిని వదిలిపెట్టేది లేదని, శిక్షపడేలా చేస్తామని చంద్రబాబు హెచ్చరించారు.  

ఫేక్‌ ముఖ్యమంత్రి.. ఫేక్‌ సంతకాలతో తనవారిని గెలిపించుకున్నారంటూ ఆయన దుయ్యబట్టారు. న్యాయస్థానం ఆదేశాలను సైతం ధిక్కరించి వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ (ys jagan mohan reddy) అరాచక చర్యల వల్లే ఎంపీటీసీ (mptc), జడ్పీటీసీ (zptc) ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఏకగ్రీవాలు అయ్యాయని ఆయన ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఏనాడూ ఇలా భారీ సంఖ్యలో ఏకగ్రీవాలు కాలేదని గుర్తు చేశారు. బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ జరిగిందని.. ఇతర పార్టీల అభ్యర్థులను బెదిరించి ఏకగ్రీవాలు చేసుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. అభ్యర్థులు కోర్టుకు వెళ్తే.. సీఎం, మంత్రులు జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు.  

click me!