మార్చిలో ఏపీ శాసన మండలి రద్దు: జగన్ కు దొరికిన హామీ

By telugu team  |  First Published Feb 16, 2020, 7:22 PM IST

ఏపీ శాసన మండలి రద్దుకు ప్రధాని మోడీతో పాటు అమిత్ షా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండలి రద్దుకు హామీ పొందినట్లు తెలుస్తోంది. మార్చి రెండో వారంలో ఆ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నారు.


అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దుకు కేంద్రం నుంచి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు స్పష్టమైన హామీ లభించినట్లు తెలుస్తోంది. మార్చిలో మండలి రద్దు కావచ్చునని భావిస్తున్నారు. మూడు రోజుల పాటు వైఎస్ జగన్ వరుసగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లను కలిశారు. 

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండో దశలో ఏపీ శాసన మండలి రద్దు బిల్లును ప్రవేశపెట్టాల్సిందిగా జగన్ వారిని కోరినట్లు తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాలు తిరిగి మార్చి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. బిల్లును మార్చి రెండో వారంలో పార్లమెంటులో ప్రవేశపెడుతామని మోడీ, అమిత్ షా జగన్ కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

Latest Videos

ఏపీ బడ్జెట్ సమావేశాలు మార్చి 15వ తేదీ నుంచి జరిగే అవకాశం ఉంది. ఈలోగా మండలి రద్దు జరగాలని జగన్ అనుకుంటున్నారు. ఏపీ శాసనసభ తీర్మానం మేరకు శాసన మండలి రద్దుకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ బిల్లును రూపొందించి మంత్రివర్గానికి సమర్పించాల్సి ఉంటుంది. 

బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదించిన తర్వాత రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి ఆమోదంతో శాసన మండలిని రద్దు చేస్తూ నోటిఫికేషన్ జారీ అవుతుంది.

కాగా, కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు, దిశ చట్టానికి ఆమోదం వంటి అంశాలను కూడా సానుకూలంగా పరిష్కరించడానికి మోడీ, అమిత్ షా అంగీకరించినట్లు చెబుతున్నారు. హైకోర్టును కర్నూలులో నెలకొల్పుతామని రాష్ట్ర బిజెపి ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన విషయాన్ని వైఎస్ జగన్ అమిత్ షాకు గుర్తు చేసినట్లు చెబుతున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను కూడా ఆయన అమిత్ షాకు వివరించారు. 

click me!